గవర్నర్ తో కేసీఆర్..బయటకు కనిపించేది వేరే!

Thu Jul 18 2019 20:50:26 GMT+0530 (IST)

పైకి సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ - కీలక భేటీ జరిగిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు మారుతున్న తరుణంలో...తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ ను కలిశారు. దాదాపు గంటపాటు ఆయనతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ బిల్లుకు సంబంధించిన వివరాలను కేసీఆర్ గవర్నర్ కు వివరించినట్లు పేర్కొంటున్నప్పటికీ - ఈ సమావేశం వెనుక రాజకీయ సంబంధమైన అంశాలు సైతం ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న నాటి నుంచి గవర్నర్ సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర విడివడిన దాదాపు ఐదున్నర సంవత్సరాల తర్వాత బుధవారం ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించారు. ఈ నేపథ్యంలో ఇవాళ నరసింహన్ ను కేసీఆర్ కలవడం  ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై ముఖ్యమంత్రులు కేసీఆర్ - జగన్ లు ఇటీవల పలుమార్లు చర్చించారు. ఈ చర్చల అనంతరం విభజన సమస్యలు - గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన అంశాల పురోగతిని నరసింహన్‌కు కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. దీంతో పాటుగా - తెలంగాణ గవర్నర్ ను సైతం మార్చడమనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా - వచ్చేనెలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కొత్త బిల్లును గురువారం ఉదయమే తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శుక్రవారం దీనిపై సభలో చర్చ జరగనుంది. ఆ తర్వాత బిల్లుకు ఆమోదం ఉంటుంది. ఈ అంశాలను సైతం గవర్నర్ కు కేసీఆర్ వివరించినట్లు సమాచారం.

కాగాఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 23న భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు విశ్వభూషణ్. వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని..  ఆ తర్వాత విజయవాడకు వస్తారు.