Begin typing your search above and press return to search.

పండుగపూట మంత్రులకు తలంటిన కేసీఆర్?

By:  Tupaki Desk   |   9 Oct 2019 7:06 AM GMT
పండుగపూట మంత్రులకు తలంటిన కేసీఆర్?
X
అధినేత కోపంలో ఉన్నప్పుడు తరచూ దానికి బలి అయ్యేది మంత్రులే. అమాత్య పదవి వచ్చిన వారిపై అధికారపక్ష నేతలు గుర్రుగా ఉంటారు. తమలో లేనిది వారిలో ఏముందన్న మాటను తమ సన్నిహితుల దగ్గర అనేస్తుంటారు. కానీ.. మంత్రి పదవితో పవర్ రావటం తర్వాత.. తరచూ అధినేత ఆగ్రహానికి గురయ్యే తీరును చూసిన పలువురు గులాబీ నేతలు.. తమకు మంత్రి పదవి రాకపోవటమే మంచిదైందనుకుంటున్నారట.

తాజాగా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఇష్యూను పర్సనల్ గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్ద ఎత్తున కోపం వచ్చేసిందట. ఈ కోపం సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల మీద కాదు.. తన కేబినెట్ లోని మంత్రుల మీదనట. మంత్రి పదవులు తీసుకోవటమే కాదు.. అవసరమైన సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాలన్న విషయం కూడా గుర్తు చేయాలా? అంటూ పండుగ పూట క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది.

ఆర్టీసీ కార్మికుల ఇష్యూ ఇంత తీవ్రంగా జరుగుతుంటే.. అలా మౌనంగా ఉండిపోతారే? ఇష్యూ పెద్దది కాక ముందే.. ఎదురుదాడి చేయాలని కూడా చెప్పాలా? ఆ మాత్రం కూడా తెలీదా? అంటూ పలువురు మంత్రులకు తలంటినట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై ఏం మాట్లాడితే ఏమవుతుందన్న ఉద్దేశంతో ఎవరికి వారు సైలంట్ గా ఉండిపోయారు మంత్రులు.

ఉద్యమనేతగా కేసీఆర్ గతంలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో అదే పనిగా చక్కర్లు కొడుతున్న వేళ.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. ఎవరు ఏ వీడియో చూపించి.. దీనికి ఏం చెబుతారన్న ముందస్తు భయంతో ఎవరికి వారు కామ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. కేసీఆర్ ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది.

సమ్మె తీవ్రత అంతకంతకూ పెరిగి.. విపక్షాలు ఒక్కటైపోతున్న వేళ.. అలాంటి సందర్భాల్లో మంత్రులు అంత రంగంలోకి దిగి ప్రభుత్వ వాదనను బలంగా వినిపించాలన్న సోయి లేకుంటే ఎలా? అన్న ప్రశ్నను కేసీఆర్ వేసినట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు కౌంటర్ ఇచ్చే విషయంలో మంత్రులు ఎవరూ ముందుకు రాకపోవటంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.

అధినేత క్లాస్ పీకిన నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు పండుగ విషయాన్ని పక్కన పెట్టి.. కార్మిక సంఘాల సమ్మెను తప్పు పట్టారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నిరంజన్ రెడ్డిలు ప్రభుత్వ వాదనను వినిపిస్తూనే.. కార్మిక సంఘాల్ని హెచ్చరించారు. కార్మిక నేతల ఉచ్చులో పడొద్దంటూ సూచనలు చేస్తున్నారు. మొన్నటి వరకూ మౌనంగా ఉన్న తెలంగాణ మంత్రులు.. ఎవరో తరుముతున్నట్లుగా మీడియా ముందుకు వచ్చి గొంతులు సవరించుకోవటం వెనుక కేసీఆర్ క్లాస్ ప్రభావమేనని చెబుతున్నారు.