Begin typing your search above and press return to search.

సీఎం ఢిల్లీ టూరు ఫ్లాపేనా ?

By:  Tupaki Desk   |   29 Nov 2021 5:30 PM GMT
సీఎం ఢిల్లీ టూరు ఫ్లాపేనా ?
X
కేసీయార్ నాలుగు రోజుల ఢిల్లీ టూరు ఫ్లాపేనా ? ఇపుడిదే అంశం రాజకీయంగా బాగా వివాదాస్పదమవుతోంది. వరి రాజకీయంతో నరేంద్రమోడితో తాడో పేడో తేల్చుకుని వస్తానని శపథం చేసి కేసీయార్ పెద్ద బృందాన్నేసుకుని ఢిల్లీకి వెళ్ళారు. నాలుగు రోజులు వెయిట్ చేసినా మోడి కాదు అమిత్ షా తో కూడా భేటీ కాలేకపోయారు. ఒకళ్ళిద్దరు కేంద్రమంత్రులతో మాత్రమే రాష్ట్రమంత్రులు సమావేశమయ్యారంతే.

మరి అంత పెద్ద బృందాన్ని వేసుకుని ఢిల్లీకి వెళ్ళిన కేసీయార్ నాలుగు రోజులు కూర్చుని ఏమి చేశారు ? ఇపుడిదే అంశంపై రాజకీయంగా వివాదాస్పదమవుతోంది. కేసీయార్ కనీసం కేంద్రమంత్రులను కూడా కలవలేదు. కేంద్రమంత్రులను కలిసింది రాష్ట్రమంత్రులు మాత్రమే. అందుకనే ఈ విషయాలన్నింటినీ గుర్తుచేస్తు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెచ్చిపోతున్నారు.

కేవలం విందు రాజకీయం చేయటానికి మాత్రమే కేసీయార్ ఢిల్లీకి వెళ్ళినట్లు రేవంత్ విరుచుకుపడుతున్నారు. రేవంత్ ఆరోపణలకు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు సరైన సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. నాలుగు రోజులు ఢిల్లీలోనే మకాం వేసిన కేసీయార్ ఏమి చేశారని మామూలు జనాలు కూడా చర్చించుకుంటున్నారు. రాజకీయంగా తన ప్రత్యర్ధులకు కాకపోయినా కనీసం జనాలకైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీయార్ మీదుంది. ఢిల్లీలో ఫ్లాపైన కేసీయార్ హైదరాబాద్ కు తిరిగి రాగానే రైతులను కేంద్రంపైకి రెచ్చగొడుతున్నారు.

మోడి, షా ను కలవటానికి ఎలాంటి అపాయిట్మెంట్ తీసుకుండానే కేసీయార్ ఢిల్లీకి వెళ్ళటం పెద్ద తప్పనే చెప్పాలి. హైదరాబాద్ లో ఉండగానే వాళ్ళతో అపాయిట్మెంట్ అడిగినా వాళ్ళదగ్గర నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అపాయిట్మెంట్ దొరక్కపోయినా నేరుగా వెళ్ళిపోతే వాళ్ళే తనకు అపాయిట్మెంట్ ఇచ్చి ఆహ్వానిస్తారని కేసీయార్ ఎలాగ అనుకున్నారో అర్ధం కావటంలేదు.

హైదరాబాద్ లో కూర్చుని కేంద్రాన్ని నోటికొచ్చినట్లు తిట్టేసిన తర్వాత సాధర స్వాగతాన్ని కేసీయార్ ఎలా ఎక్స్ పెక్ట్ చేస్తారు ? హోలు మొత్తంమీద అర్ధమైందేమంటే కేసీయార్ ఢిల్లీ టూరు అట్టర్ ఫ్లాపనే. వరి కొనుగోలు విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటిస్తున్నట్లు చెప్పిన కేసీయార్ మరి ఆ యుద్ధానికి ఏ విధంగా రెడీ అయ్యారన్నదే అర్ధం కావటంలేదు. అసలు బాయిల్డ్ రైస్ కొనేదే లేదని తేల్చిచెప్పేసిన కేంద్రంతో కేసీయార్ ఏ విధంగా కొనిపించగలరు ? రా రైస్ తప్ప దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ బాయిల్డ్ రైస్ కొనేవాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. అన్నీ తెలిసీ కేసీయార్ ప్రకటించిన యుద్ధం చివరకు ఏమైందో ఆయనే చెప్పాలి.