Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ క్లాస్‌!

By:  Tupaki Desk   |   19 Jan 2022 10:31 AM GMT
ఆ ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ క్లాస్‌!
X
తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌కు ప్ర‌స్తుత రాష్ట్ర రాజ‌కీయాలు స‌వాలు విసురుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పుంజుకోవ‌డంతో కేసీఆర్‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. ఏడేళ్లుగా ఆధిప‌త్యం సాగించిన ఆయ‌న‌కు ఇప్పుడు ఈ రెండు పార్టీల నుంచి పోటీ ఎదుర‌వుతోంది. ముఖ్యంగా బీజేపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఉన్నారు. అందుకే అటు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని.. ఇటు రాష్ట్రంలోని ఆ పార్టీ నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే విజ‌యం కోసం కేసీఆర్ పోరాడ‌క త‌ప్ప‌ని స్థితి ఎదుర‌వుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఒక‌వేళ బీజేపీ మ‌రింత బ‌లంగా మారితే అప్పుడు టీఆర్ఎస్ విజ‌యంపై మ‌రింత ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంటుంది. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్న కేసీఆర్ ఆ దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇప్ప‌టి నుంచే ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునే దిశ‌గా సాగుతున్నారు. ఓ వైపు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించ‌డంతో పాటు మ‌రోవైపు పార్టీపై దృష్టి సారించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున ఎవ‌రికి టికెట్లు కేటాయించాల‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త తెచ్చుకునే ప్ర‌య‌త్నాల్లో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా ప్ర‌స్తుత ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ఉంది? వాళ్ల‌పై ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అభిప్రాయం ఉంది? అని ఆయ‌న ఆరా తీస్తున్నార‌ని తెలిసింది. ఈ మేర‌కు ఎమ్మెల్యేల ప‌నితీరుపై తాజాగా స‌ర్వే నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం. ఆ నివేదిక‌లు ప‌రిశీలించిన కేసీఆర్‌.. ఆ స‌ర్వేలో త‌క్కువ మార్కులు వ‌చ్చిన ఎమ్మెల్యేల‌ను నేరుగా పిలిపించి గ‌ట్టిగా క్లాస్ పీకిన‌ట్లు తెలిసింది. ఈ స‌ర్వేలో త‌క్కువ మార్కులు వ‌చ్చిన వాళ్ల‌కు టికెట్ ఇచ్చేది లేద‌ని, వాళ్ల స్థానంలో వేరే వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎలా ఉంది? అభ్య‌ర్థిని మారిస్తే టీఆర్ఎస్ గెలిచే అవ‌కాశం ఉందా? త‌దిత‌ర అంశాల‌పై స‌ర్వే నివేదిక‌లు కేసీఆర్ చేతికి అందాయ‌ని తెలిసింది. ప‌నితీరు స‌రిగ్గా లేని ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ క్లాస్ పీక‌డంతో ఇప్పుడు వాళ్లంతో నియోజ‌క‌వ‌ర్గాల్లోనే మాకం వేశార‌ని అంటున్నారు. ఏయే అంశాల్లో వెన‌క‌బ‌డ్డామో తెలుసుకుని త‌ప్పులు స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టాక్‌. ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉంటూ వాళ్ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ అధిష్ఠానం దృష్టిలో ప‌డేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేల ప‌నితీరులో అనూహ్యంగా మార్పు రావ‌డం పార్టీ క్యాడ‌ర్‌లోనూ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని స‌మాచారం.