Begin typing your search above and press return to search.

త్వరలో కేసీఆర్ శకం ముగియనుందా?

By:  Tupaki Desk   |   10 Sep 2019 8:42 AM GMT
త్వరలో కేసీఆర్ శకం ముగియనుందా?
X
కాంగ్రెస్ పార్టీ ఏదో చేసేస్తుందని అంతా ఊహించినా అందుకు భిన్నంగా కేసీఆర్ రెండోసారి భారీ మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారు. అలాంటి గెలుపు ఇచ్చిన అతి విశ్వాసమో - అహంకారమో కానీ కేసీఆర్‌ లోని నియంత పూర్తిస్థాయిలో నిద్రలేచారు. తాను, తన అనుంగు మిత్రుడు మాత్రమే సీఎం - డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసి వేరెవ్వరినీ మంత్రివర్గంలోకి తీసుకోకుండా కొన్ని నెలల పాటు పాలన సాగించారు కేసీఆర్. అయినా... పార్టీలోని ఒక్క ఎమ్మెల్యే కానీ - సీనియర్ నేతలు కానీ దానిపై నోరు మెదపలేదు. మంత్రివర్గం లేకుండా పాలనేంటని ప్రశ్నించలేకపోయారు... కనీసం మంత్రి వర్గం ఏర్పాటుచేయండి సార్ అని సలహా కూడా ఇవ్వలేకపోయారు.

ఆ తరువాత ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలు లేరన్న విమర్శకు తెరదించే ప్రయత్నం చేయలేదాయన.. అయినా - పార్టీలోని మహిళా నేతలు కిమ్మనలేదు.

అంతేకాదు.. హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు... ఆయన గత ప్రభుత్వంలో నీటి పారుదల మంత్రిగా పనిచేసి రాత్రీ పగలు తేడాలేకుండా పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసినా దాని ప్రారంభోత్సవంలో కానీ - ఆ తరువాత కానీ హరీశ్ పేరు వినపడకుండా చేశారు. అయినా, దానిపైనా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. సెక్రటేరియట్‌ కు వెళ్లకుండా ఫాం హౌస్‌ లోనే కూర్చుని కథ నడిపిస్తున్నా పార్టీ నేతలెవరూ ఇది కరెక్టు కాదు సార్ - చెడ్డ పేరొస్తోందని చెప్పే ధైర్యం చేయలేకపోయారు.

కానీ, ఇప్పుడు కేసీఆర్ రెండోసారి సీఎం అయిన 8 నెలల తరువాత ఒక్కసారిగా అసంతృప్తి బట్టబయలైంది. నిరసన గళాలు నిమిష నిమిషానికీ పెరుగుతున్నాయి. ఇంతలోనే ఎందుకింత మార్పు... ? దీనికి కారణాలేమిటి? కేసీఆర్ స్వయంకృతాపరాధమా.. లేదంటే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీ కల్పిస్తున్న భరోసాయా? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.. కేసీఆర్ శకం ముగిసినట్లేనా?

కేసీఆర్ తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టిన తరువాత నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు... ఒక్కరొక్కరుగా కేసీఆర్‌ కు వ్యతిరేకంగా బాహాటంగా నిరసన గళం వినిపించడం ఆ పార్టీ నేతలను - కేసీఆర్‌ ను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అసంతృప్తి ఉందని ఈసరికే కేసీఆర్‌ కు అర్థమైనా ‘నన్నడిగేవాడెవ్వడు’.. ‘నన్ను కాదని పోయేవాడెవ్వడు’ అన్నట్లుగా ఉండేది ఆయన వ్యవహారం. కానీ.. ఇప్పుడలాగే వ్యవహరిస్తే ఇక కుదరదన్న సంగతి ఈసరికే ఆయనకు అర్థమై ఉండాలి.

సోమవారం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన తరువాత కేబినెట్లోకి తీసుకున్న నేతలను చూసి ఆది నుంచి టీఆరెస్ లో ఉన్న నేతలు మండిపడుతున్నారు. నాయిని నరసింహారెడ్డి - జోగు రామన్న బాహాటంగా విమర్శించారు. కేసీఆర్ మోసం చేశారని నాయిని ఆరోపించగా.. జోగు రామన్న తన సెక్యూరిటీని వెనక్కు పంపించేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

వీరేకాదు.. మాదిగలకు అవకాశమివ్వలేదంటూ ఆ వర్గానికి చెందినవారూ మండిపడుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్య - కడియం శ్రీహరిలు కూడా కేసీఆర్ తీరుపై రగిలిపోతున్నారు.

తలసాని - ఎర్రబెల్లి దయాకరరావు - సత్యవతి రాథోడ్ - సబితా ఇంద్రారెడ్డి - చామకూర మల్లారెడ్డి - గంగుల కమలాకర్.. ఇలా అనేక మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారినే కేసీఆర్ మంత్రులుగా తీసుకున్నారు కానీ పార్టీని ఆది నుంచి నమ్ముకున్నవారికి మంత్రి పదవులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.

టీఆరెస్‌ లో అసంతృప్తి ఇవ్వాల్టికి ఇవ్వాళ పుట్టిందేమీ కాదు.. ఇంతకాలం అది నివురుగప్పిన నిప్పులా ఉండి సమయానుకూలంగా బయటకొస్తోంది. నిన్నటి నుంచి గళం విప్పుతున్నవారి కంటే ముందే సీనియర్ నేత ఈటెల ఇటీవల కేసీఆర్‌ పై తీవ్ర విమర్శలు చేసి పిల్లి మెడలో గంట కట్టారు. ఆయన గంట కట్టిన తరువాత రసమయి బాలకిషన్.. ఇప్పుడు మిగతా వారంతా ఈటెల ఇచ్చిన ధైర్యంతో కేసీఆర్ తీరును ఎండగడుతున్నారు. కేసీఆర్ మెడలో గంట కట్టిన ఈటెల చేతి నుంచి కీలకమైన ఆర్థిక శాఖను తప్పించడం తప్ప కేసీఆర్ ఆయన్ను ఏమీ చేయలేకపోయారు.

కేసీఆర్‌ పై అసంతృప్తి ఇంతగా బయటపడడానికి కారణం ఆయన స్వయంకృతాపరాధం ఒకటైతే.. రెండోది బీజేపీ బలపడి దూసుకెళ్తుండడం. 2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతిని ఉన్న సీట్లు కూడా కోల్పోయి ఒక్క స్థానానికే పరిమితం కావడంతో కేసీఆర్ ఆ పార్టీని చాలా తక్కువగా అంచనా వేశారు. కానీ, అక్కడికి నాలుగు నెలల్లోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవితనే ఓడించింది. తెలంగాణలో గుండెకాయలాంటి కరీంనగర్ ఎంపీ సీటును ఎత్తుకెళ్లింది. ఆ విజయాలను కొనసాగించాలన్న నిశ్చయంతో బీజేపీ దూకుడు నిర్ణయాలు తీసుకుంది. కిషన్ రెడ్డిని ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని చేసింది. ఆ దెబ్బకు కేసీఆర్ గుండెల్లో రాయి పడింది. టీఆరెస్‌ లోని కేసీఆర్ వ్యతిరేకులు - తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారికి బీజేపీ ఆశాకిరణంలా కనిపించింది.

తాజాగా.. బండారు దత్తాత్రేయను గవర్నరు చేయడం.. తెలంగాణ గవర్నరును మార్చి తమిళనాడు బీజేపీ నేతను తెచ్చిపెట్టడంతో పాటు తెలంగాణలో విస్తరణకు గేట్లు ఎత్తి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను తీసుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో టీఆరెస్‌లోని కేసీఆర్ వ్యతిరేకులు అటు చూస్తున్నారు. ఇప్పటికే వివేక్ బీజేపీలో చేరారు. ఆయన కూడా తన వర్గానికి చెందిన నేతలను బీజేపీ వైపు ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో గులాబీ బాస్‌ కు గులాంగిరీ చేయడం కంటే బీజేపీలో చేరి గౌరవంగా రాజకీయాలు చేయడం.. కుదిరితే పదవులు సంపాదించుకోవడం నయమన్న ఉద్దేశానికి టీఆరెస్‌ లోని చాలామంది సీనియర్లు ఇప్పటికే వచ్చారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఒక్కరొక్కరుగా కేసీఆర్‌ పై నిరసన గళం విప్పుతున్నారని టాక్. అసంతృప్తి పాతదే అయినా కొత్తగా బలం రావడంతో అది బయటపడుతోందని తెలుస్తోంది. దీన్ని బీజేపీ నూటికి నూరు శాతం ఉపయోగించుకోలిగితే తెలంగాణలో కేసీఆర్ శకం ముగియడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.