తుస్సుమన్న కేసీఆర్ ఢిల్లీ పర్యటన!

Thu Nov 25 2021 09:00:02 GMT+0530 (IST)

KCR Delhi tour

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఏమీ తేల్చుకోలేక తిరిగి వచ్చారు. బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. కేంద్రం నుంచి నిర్దిష్టమైన హామీ లేకుండా ఉసూరుమంటూ తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తుస్సుమందని ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురైందని ఎద్దేవాచేస్తున్నారు. అసలు కేసీఆర్ కు ఢిల్లీ పెద్దలు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు? నాలుగు రోజుల నిరీక్షించిన కేసీఆర్ ఎందుకు నిరాశతో తిరిగివచ్చారు? కేసీఆర్ గొప్పలు ఢిల్లీలో పనిచేయలేదా? ఇలా అనేక ప్రశ్నలు కేసీఆర్ ను వెంటాడుతున్నాయి.బియ్యం సేకరణపై కేంద్రం వద్దకు కేసీఆర్‌తో పాటు కేటీఆర్ నిరంజన్ రెడ్డి గంగుల కమలాకర్ సీఎస్ సోమేశ్ కుమార్ వెళ్లారు. వివాదాస్పందగా మారిన ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధాని మోదీ అమిత్ షా కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ మంత్రులను కలిసి చర్చించాలని ఢిల్లీ వెళ్లారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. దేశ వ్యాప్తం కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న విధానాలను కేసీఆర్ తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా రైతాంగానికి మద్దతుగా నిలుస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ నుంచే ప్రారంభిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రతో తాడోపేడే తేల్చుకుంటామని కేసీఆర్ బృదం 21న ఢిల్లీ వెళ్లింది.

ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్ల కేసీఆర్ బృందానికి ప్రధాని కేంద్ర హోంమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. రానున్న యాసంగి కొనుగోలుపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ బృందం కోరింది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ  కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. చివరకు పీయూష్ గోయల్ ను కలుసుకునేందుకు కేటీఆర్ నేతృత్వంలో  ప్రయత్నించారు. సమస్యలను వివరించేందుకు పీయూష్ గోయల్‌కు కేటీఆర్ పలు సార్లు ఫోన్ చేయాల్సి వచ్చిందని అయినా ప్రయోజనం లేదని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

కేసీఆర్ కు కావాలనే ఢిల్లీ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే చర్చ సాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. దాదాపు వారంపైనే హస్తినలో మకాం వేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేసీఆర్ కు ఢిల్లీ పెద్దలు అపాయింట్ మెంట్ ఇస్తూ వచ్చారు. ఈ పరిణామాలను గమనించిన ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్‌ఎస్ ఒక్కటేనని ప్రచారం చేశాయి. అయితే ప్రతిపక్షాల వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ బీజేపీ తిప్పికొడుతూ వచ్చాయి. గతంలో అనేక సందర్భాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ సమర్ధిస్తూ వచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ రూట్ మార్చారు.

కేంద్రంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను తప్పుబడితే.. దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంతో సఖ్యతగా ఉన్న కేసీఆర్ ఒక్కసారి ప్లేటు మార్చడంతో బీజేపీ అధి నాయకత్వం సీరియస్ గా తీసుకుందని అందువల్లే కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే చర్చ నడుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చే జరిగింది. దీంతో కేంద్రం ఆయనను దగ్గరకు కూడా రానివ్వలేదని అంటున్నారు. ఢిల్లీ నుంచి ఎలాంటి హామీ లేకుండా కేసీఆర్ తిరుగుప్రయామవ్వడంపై అనేక పుకార్లు వస్తున్నాయి. ఇది కేసీఆర్ కు ఎదురుదెబ్బెనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.