Begin typing your search above and press return to search.

ఇంటికి పొలానికి పోలికేమైనా ఉందా కేసీఆర్..?

By:  Tupaki Desk   |   1 July 2018 5:01 AM GMT
ఇంటికి పొలానికి పోలికేమైనా ఉందా కేసీఆర్..?
X
కొన్ని విష‌యాల్ని ఎంత త‌క్కువ పొడిగిస్తే అంత మంచిది. అందుకు భిన్నంగా తెగే వ‌ర‌కూ లాగితే మొత్తంగా న‌ష్ట‌పోవుడే. ఈ విష‌యం కేసీఆర్ లాంటి మేధావికి.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌కు.. పోల్ మేనేజ్ మెంట్ బాగా తెలిసినోడికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముంగిట్లోకి ముంద‌స్తు వ‌చ్చేసింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. వీలైనంత‌వ‌ర‌కూ క‌లుపుకుపోవాలె కానీ.. విడ‌గొట్టుకోకూడ‌దు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ చిత్ర‌మైన వాద‌న‌ల్ని తెర మీద‌కు తేవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మోకాలికి బోడిగుండుకు లింకెట్టిన రీతిలో కౌలురైతుల‌కు.. అద్దెకు ఇళ్ల‌ను తీసుకునే వారికి పోలిక పెట్టేసి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసేలా ఉన్నాయి. వ్యాపార‌.. వాణిజ్య సంస్థ‌ల‌కు సంబంధించి అద్దెకు తీసుకున్న వారితోనూ.. ఇళ్ల‌ను అద్దెకు తీసుకున్న వారితో కౌలురైతుల్ని పోల్చ‌టం ఏ మాత్రం స‌బ‌బా? అన్న ప్ర‌శ్న‌ను అడిగితే.. ఎవ‌రూ కాద‌నే చెబుతారు.

మ‌రి.. మేదావి కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా బ‌క్క‌చిక్కిన కౌలు రైతును.. సంప‌న్న వ్యాపార‌.. వాణిజ్య సంస్థ‌ల‌కు లీజుకు తీసుకునే వారితో పోల్చ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. వ్యాపార‌.. వాణిజ్యంతో పాటు అద్దెకు తీసుకునే ఇండ్ల వారిని ప్ర‌స్తావించారు. ఒక ఇంటిని ఒక వ్య‌క్తి అద్దెకు తీసుకున్నాడ‌నుకుందాం. అత‌నికి ఆ ఇంటి కార‌ణంగా న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉందా? ప్ర‌కృతి కార‌ణంగా అత‌ని ఆర్థిక ప‌రిస్థితి మీద దెబ్బ ప‌డే వీలుందా? అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే.. అలాంటిదేమీ ఉండ‌ద‌న్న మాట వ‌స్తుంది.

అలాంట‌ప్పుడు ఇంట్లో అద్దెకు ఉండే వ్య‌క్తికి.. భూమిని న‌మ్ముకొని వ్యవ‌సాయం చేసే కౌలురైతుకు లింకెట్ట‌టం ఏమిటి? ఒక‌వేళ కేసీఆర్ చెప్పిందే నిజ‌మైన‌ప్పుడు.. అద్దెకు ఇళ్ల‌ను ఇచ్చే వారు కొన్ని సంద‌ర్భాల్లో అద్దెకు దిగిన వారి కార‌ణంగా.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో మంచిత‌నం కార‌ణంగా త‌క్కువ మొత్తానికి అద్దెకు ఇళ్ల‌ను ఇస్తుంటారు. మ‌రి.. అలాంటి వారికి కూడా సాయం చేస్తారా? ఇదొక్క‌టే కాదు.. వ్యాపారం చేసేందుకు భ‌వ‌నాన్ని అద్దెకు ఇచ్చే య‌జ‌మానుల‌కు అండ‌గా ఉండేందుకు వారికి సాయం ఇస్తే ఓకేనా? అన్న ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

ఇలాంటి చిత్ర‌మైన వాద‌న‌ల‌కు కార‌ణం ముఖ్య‌మంత్రే. ఎందుకంటే.. కౌలు రైతులు అన్న ఫార్మాట్ చాలా క్లిష్ట‌మైన‌ది. అదే స‌మ‌యంలో.. వారంతా తీవ్ర‌మైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు.

ఏళ్ల‌కు త‌ర‌బ‌డి వ్యవ‌సాయం చేస్తున్నా.. భూమిని ఉపాధిగా అనుకున్నా.. య‌జ‌మానికి కోపం వ‌చ్చినా.. ఆగ్ర‌హం వ‌చ్చినా నోరెత్తి మాట్లాడ‌టానికి వీల్లేదన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. కొన్ని సంద‌ర్భాలు ఇందుకు మిన‌హాయింపు అన్న‌ది చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా చూస్తే.. సంబంధం లేని అంశాల్ని తెర మీద‌కు తెచ్చి.. వాటిని కౌలు రైతుల‌కు లంకె పెట్ట‌టం ఏ మాత్రం స‌బ‌బు కాదు. ఆ విష‌యాన్ని కేసీఆర్ ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే.. అందుకు భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ అంత సెన్స్ బుల్ గా ఆలోచిస్తారంటారా?