Begin typing your search above and press return to search.

మోదీ సాబ్..కేసీఆర్ కామెంట్లు విన్నారా?

By:  Tupaki Desk   |   25 Jan 2020 3:20 PM GMT
మోదీ సాబ్..కేసీఆర్ కామెంట్లు విన్నారా?
X
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదించిన పౌర సవరణ చట్టం (సీఏఏ) పై టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి భారీ స్ట్రోక్ ఇచ్చేసిన కేసీఆర్... సీఏఏ దేశానికి మంచిది కాదని, అది వందకు వందశాతం తప్పుడు నిర్ణయమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే సీఏఏను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని కేసీఆర్ తేల్చి పారేశారు. అంతటితో ఆగని కేసీఆర్... సీఏఏపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టు కూడా పేర్కొన్నారు. సీఏఏపై రాబోయే నెల రోజుల్లో ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఇంకా ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘టీఆర్‌ఎస్‌ సెక్యూలర్‌ పార్టీ. మేము ఎవరికి భయపడం. ఏ పనినైనా స్పష్టతతో చేస్తాం. సీఏఏను పార్లమెంట్‌లోనే వ్యతిరేకించాం. సీఏఏ వందకు వంద శాతం తప్పుడు నిర్ణయం. దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానం అని రాజ్యాంగంలో ఉంది. అలాంటప్పుడు ముస్లింలను మాత్రం పక్కకు పెడితా అంటే ఎలా? ఇది నాకు బాధ కలిగిచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్‌ చేస్తే కూడా అదే చెప్పాను. ఆర్టికల్‌ 370కి సపోర్ట్‌ చేశా. అది దేశ గౌరవానికి సంబంధించింది కాబట్టి మద్దతు ఇచ్చాం. అదేవిధంగా సీఏఏను వ్యతిరేకించాం. కుండబద్దలు కొట్టినట్లు మా నిర్ణయాన్ని చెప్పాం. భారత్‌ను మోదీ హిందూ దేశంగా మార్చుతున్నారంటూ మేథావులు అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో కేంద్రం విద్వేషాలు రెచ్చగొడుతోంది. బీజేపీ తీరు ఇదేనా? బైంసా ఘటనకు పాల్పడింది ఈ భక్తులే, గడబడ్ అవుతుంటే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పంపి పరిస్థితి సక్కదిద్దాం. నేను హిందువునే. నేను బహిరంగంగా యాగం చేశాను. కొంతమంది తలుపులు పెట్టుకొని యాగం చేస్తారు. మతాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాలి. సీఏఏను వ్యతిరేకిస్తూ అవసరమైతే 10 లక్షల మందితో సభ నిర్వహిస్తాం’ అని కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ మరోమారు కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లేనా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఓ మోస్తరు హడావిడి చేసిన కేసీఆర్.. మోదీ నేతృత్వంలోని బీజేపీకి పెద్ద ఝలక్కే ఇచ్చారు. అయితే ఎందుకనో గానీ... ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ను అటకెక్కించేశారు. ఆ తర్వాత కేంద్రంలో మరోమారు మోదీ సర్కారే కొలువు దీరడంతో బీజేపీతో సఖ్యతగానే మెలగుతున్నట్లుగా కనిపించారు. అయితే సీఏఏపై... అది కూడా తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలో కేసీఆర్... కేంద్రం తీసుకొచ్చిన సీఏఏపై ఈ తరహాలో సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.