Begin typing your search above and press return to search.

నిరాడంబ‌రంగా తెలంగాణ అవ‌త‌ర‌ణ వేడుక‌లు

By:  Tupaki Desk   |   2 Jun 2020 12:10 PM GMT
నిరాడంబ‌రంగా తెలంగాణ అవ‌త‌ర‌ణ వేడుక‌లు
X
పార్టీలు వేర‌యినా.. జెండాలు వేర‌యినా.. ఒక‌టే నినాదం.. ఒకటే ఉద్య‌మం.. ఒక‌టే ల‌క్ష్యం అదే ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం. అలా జ‌రిగిన ఉద్య‌మం సాకార‌మై దేశంలో ఒక రాష్ట్రంగా జూన్ 2వ తేదీన ఆవిర్భ‌వించింది. నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుని ఏడో ప‌డిలోకి అడుగుపెట్టింది. వాస్త‌వంగా ప్ర‌తియేటా అవ‌త‌ర‌ణ వేడుక‌లు వారం రోజుల పాటు పండుగ‌లా జ‌రిగేవి. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో వేడుక‌లు లేకుండా నిరాడంబ‌రంగా ఉత్స‌వాలు నిర్వ‌హించారు.

అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు హైద‌రాబాద్‌లోని గ‌న్‌పార్క్‌లో అమ‌ర‌వీరుల స్తూపానికి పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జాతీయ జెండా ఆవిష్క‌రించారు. హంగుఆర్భాటం లేకుండా సాదసీదాగా ఉత్స‌వాలు జ‌రిగాయి. ఇక టీఆర్ఎస్ కార్యాల‌యంలో కూడా జాతీయ జెండా ఎగుర‌వేశారు. ముఖ్య‌మంత్రి వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. అవ‌త‌ర‌ణ వేడుక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ, తెలుగుదేశం, సీపీఐ పార్టీలు జెండా వంద‌నం చేశాయి.

రాష్ట్ర‌వ్యాప్తంగా కూడా నిరాడంబ‌రంగా ఉత్స‌వాలు జ‌రిగాయి. జిల్లాకేంద్రాల్లో మంత్రులు హాజ‌రై అమ‌ర‌వీరుల స్తూపాల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం జాతీయ జెండా ఎగుర‌వేశారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నారాయ‌ణ‌పేట‌, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్, రంగారెడ్డి‌తో పాటు అన్ని జిల్లాలు, మండ‌ల‌కేంద్రాల్లో ఉత్స‌వాలు నిర్వ‌హించారు. అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ జ‌ల‌దీక్ష‌ల‌కు దిగింది. ఈ ఆందోళ‌న‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా ఎలాంటి సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు లేకుండానే ఉత్స‌వాలు ముగిశాయి.