రామోజీ ఇంట పెళ్లికి కేసీఆర్ వెళితే విశేషమా?

Sat Apr 20 2019 16:13:40 GMT+0530 (IST)

KCR Attend for Ramoji Rao Grand Daughter Wedding

మీడియా మొఘల్ రామోజీ ఇంట మరో పెళ్లి జరిగింది. ఆ మధ్యన రామోజీ పెద్ద కొడుకు కిరణ్.. కోడలు మార్గదర్శి ఎండీ శైలజా ముద్దుల తనయ పెళ్లి జరగ్గా.. ఈ రోజు చిన్న కొడుకు దివంగత సుమన్ పెద్ద కుమార్తె వివాహం ఇవాళ జరిగింది. రామోజీ ఇంట పెళ్లి అంటే మాటలా?  ప్రతి విషయాన్ని ఆచితూచి అన్నట్లుగా ఎంపిక చేసే రామోజీ.. తన మనమరాళ్ల పెళ్లిళ్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజా పెళ్లి విషయంలో పెద్ద హడావుడి లేకుండా.. వార్తల్లో నానకుండా పెళ్లి కార్యక్రమం పూర్తైంది. రామోజీ ఇంట పెళ్లి అంటే మాటలా?  పెద్ద పెద్ద రాజకీయ నేతలు.. పారిశ్రామికవేత్తలు.. సినిమా.. న్యాయవాద.. పాత్రికేయ రంగాలే కాక పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.  ఈ పెళ్లికి ఎంతమంది వచ్చినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావటం హాట్ టాపిక్ గా మారింది.

రామోజీ ఫిలింసిటీలో జరిగిన వివాహమహోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు. కేసీఆర్ రాకను పలువురు ఆసక్తిగా గమనించారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామోజీకి చెందిన మీడియా సంస్థ మహాకూటమికి మద్దతు పలికిన వైనాన్ని మర్చిపోలేం.

ఈ చర్యతో కేసీఆర్ కినుకు వహించారని.. రామోజీ విషయంలో ఆయన కోపంతో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఎన్నికల ఫలితాల నుంచి సర్దుకున్న రామోజీ మీడియా.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా బ్యాలెన్స్ డ్ గా వ్యవహరించారన్న మాట వినిపించింది. ఇటీవల కాలంలో రామోజీ మీడియా సంస్థలు కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై సానుకూలంగా స్పందిస్తూ.. డ్యామేజ్ కంట్రోల్ చర్యల్ని పాటించిందన్న మాట ఉంది.

తనతో సై అన్నోళ్లతో సై అనే కేసీఆర్ లో మరో చిత్రమైన కోణం ఉంది. తనను ఎంత వ్యతిరేకించినా.. రాజీకి వస్తే మాత్రం కాసింత కూల్ అయ్యే తత్త్వం ఎక్కువనే చెబుతారు.

రామోజీ అంటే కేసీఆర్ కు భక్తి ఉందని.. తన ఉన్నతికి ఆయన చేసిన సాయాన్ని మర్చిపోలేరని.. ఈ కారణంతోనే మధ్య మధ్యలో స్పర్థలు వచ్చినా.. సర్దుకుంటారని చెబుతారు. తాజాగా జరిగిన పెళ్లికి హాజరు కావటం ద్వారా కేసీఆర్ తన సందేశాన్ని ఇచ్చేశారని.. దానికంటే ముందే రామోజీ తన సందేశాన్ని తన మీడియాతో చెప్పేయటం మర్చిపోకూడదంటారు. మొత్తానికి ఆ మధ్యలో రామోజీ.. కేసీఆర్ ల మధ్య పెరిగిన దూరం.. తాజా పెళ్లితో ప్యాచప్ కావటమే కాదు.. వారి మధ్య బంధం మరింత బలపడిందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ అవసరం రామోజీకి ఎంత అవసరమో.. రామోజీ అవసరం కేసీఆర్ కు అంతేనన్న విషయం ఇద్దరికి తెలియనిది కాదు కదా.