Begin typing your search above and press return to search.

అదానీ ఎపిసోడ్ లోకి కేటీఆర్ ఎంట్రీ

By:  Tupaki Desk   |   29 Jan 2023 7:00 AM GMT
అదానీ ఎపిసోడ్ లోకి కేటీఆర్ ఎంట్రీ
X
తండ్రి కేసీఆర్ కు అప్ గ్రేడ్ వెర్షన్ లా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయాలని ఒకసారి డిసైడ్ అయితే చాలు.. మాట్లాడిన ప్రతిసారీ.. వారిని ఉద్దేశించి కొత్త తరహా విమర్శలు.. ఘాటు ఆరోపణలు చేసే అలవాటు కేసీఆర్ కు ఉంది. కాకుంటే.. ఆయనతో వచ్చిన ఇబ్బంంది అంతా.. ఇవాళ మాట్లాడితే మళ్లీ ఎప్పుడు మాట్లాడతారో అంచనా వేయటం కష్టం. కానీ.. కేటీఆర్ మాత్రం అలా కాదు.

కేసీఆర్ లో ఏదైతే లోపం ఉందో.. ఆ లోపాన్ని అధిగమించేలా ఆయన వ్యవహరశైలి ఉంటుంది. అమావాస్యకు.. పౌర్ణానికి కేసీఆర్ రియాక్టు అయితే.. కేటీఆర్ మాత్రం ఒకసారి డిసైడ్ అయ్యాక.. వరుస పెట్టేస్తుంటారు. ఏ చిన్న అవకాశం చిక్కినా వదిలిపెట్టకుండా మాట్లాడుతుంటారు. అది.. ఇది అన్నది కాకుంటే.. ఏదైనా సరే.. మోడీషాల సెంట్రిక్ గా ఆయన మాటల దాడి ఉంటుంది. తాజాగా పెను సంచలనంగా మారిన అదానీ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు కేటీఆర్.

అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై స్పందించిన ఆయన.. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీ సంస్థలకు హిండెన్ బర్గ్ 88 ప్రశ్నాస్త్రాల్ని సంధిస్తే.. కేటీఆర్ మాత్రం మోడీపై ప్రశ్నల అస్త్రాన్ని ఎక్కు పెట్టారు. అదానీ స్టాక్ ల్లో ఎల్ఐసీ.. ఎస్ బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు.. రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి? ఆ రెండు సంస్థల్ని అలా నెట్టిందెవరు? ఈ మొత్తం ఎపిసోడ్ లో సాయం చేసినోళ్లు ఎవరు? అంటూ ప్రశ్నించారు.

ఆయన నేరుగా మోడీని ప్రశ్నించినట్లుగా ఆయన ప్రశ్నలు లేకున్నా.. ఆయన అంతిమ లక్ష్యం అదేనన్న విషయం తెలిసిందే. అదానీ సంస్థలు వెలిగిపోవటానికి కారణం మోడీషాల అండ అనే మాట పారిశ్రామికవర్గాల్లోనూ.. రాజకీయ వర్గాల్లోనూ తరచూ వినిపించే విషయం తెలిసిందే.

అయితే.. ఆ విషయాన్ని అలా ప్రస్తావించకుండా.. హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్న కేటీఆర్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం ద్వారా అదానీ ఎపిసోడ్ లోకి కేటీఆర్ సైతం ఎంట్రీ ఇచ్చారని చెప్పాలి. మరి.. ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.