Begin typing your search above and press return to search.

అమిత్ షా ప్రధాని అయితేనే ఓకే.. మోడీతో నాశనమే.. కేఏ పాల్ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   30 Jun 2022 2:33 PM GMT
అమిత్ షా ప్రధాని అయితేనే ఓకే.. మోడీతో నాశనమే.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
X

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన మాటలు అనూహ్యం.. విమర్శలు ఊహించకుండా ఉంటాయి. రాజకీయాల్లో సీరియస్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని ఆయనపై పేరుంది. అటు జగన్ ను, చంద్రబాబును తిడుతారు. ఇటు కేసీఆర్ ను తూర్పారపడుతారు. అమిత్ షాను కలిసి తాజాగా మోడీని తిట్టిపోశారు. అందుకే కేఏ పాల్ చర్యలు అసాధారణం అని చెప్పకతప్పదు.

కేఏ పాల్ మొన్నటివరకూ బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆయనకు మద్దతుగా మాట్లాడారు. కేసీఆర్ పై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇంతలోనే ఏమైందో కానీ తాజాగా బీజేపీని టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ ఏపీ, తెలంగాణ పర్యటనల నేపథ్యంలో హాట్ కామెంట్స్ చేశారు. మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని కేఏ పాల్ విమర్శించారు. ప్రధానిగా మోడీ ఉండకూడదని మండిపడ్డారు. దేశం అప్పుల కుప్పగా మారిందని ఫైర్ అయ్యారు. వెనిజుల, శ్రీలంకలా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రం కూడా అలానే ఉందని అన్నారు. తనకున్న అనుభవంలో మోడీ ఎంత అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. తను దేశాన్ని రక్షించగలనని.. ఆర్థికంగా అభివృద్ధి చేయగలనని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

ప్రధానిగా మోడీ కాకుండా అమిత్ షా అయితే ప్రధానిగా బాగుంటుందని కేఏ పాల్ పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. నిజాయితీ, మార్పు కావాలంటే కేఏ పాల్ ను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

బీజేపీ నుంచి దేశాన్ని కాపాడడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని రూపాల తనతో అన్నారని కేఏ పాల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు. దేశంలో అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయని.. ప్రజలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీయాలని.. ఇదే లాస్ట్ ఛాన్స్ అని కేఏ పాల్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబంపై రూ.10 లక్షల అప్పు ఉందని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.