Begin typing your search above and press return to search.

కేఏ పాల్ ప్ర‌జా యాత్ర‌ అంట.. యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇక పండుగే పండుగ!

By:  Tupaki Desk   |   7 July 2022 4:12 AM GMT
కేఏ పాల్ ప్ర‌జా యాత్ర‌ అంట.. యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇక పండుగే పండుగ!
X
కేఏ పాల్‌ని రాజకీయ నేతగా చూసేవారి కంటే కమెడియన్‌గా చూసేవారే ఎక్కువ అని అంటుంటారు. ఆయన మాటలు, చేష్టలు, హావభావాలు, ఆయన చెప్పుకునే గొప్పలు మంచి విదూషకుడిని తలపిస్తాయని చెప్పుకుంటుంటారు. సీరియస్‌ పాలిటిక్స్, బూతులు, తిట్లతో అలసిపోయినవారికి తన మాటలతో కేఏ పాల్‌ మంచి వినోదం పంచుతుంటార‌ని అనుకుంటుంటారు. తన పార్టీ తరఫున ఒక్క వార్డు మెంబర్‌ లేకపోయినా దేశానికి కాబోయే ప్రధానిమంత్రిని తానేనని కేఏ పాల్ చెబుతుంటారు.

కాగా 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రజా శాంతి పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల బరిలోకి దిగారు.. కేఏ పాల్‌. వైఎస్సార్‌సీపీని, వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఎస్సీలు, క్రిస్టియన్‌ ఓట్లను చీల్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కేఏ పాల్‌తో పార్టీ పెట్టించారనే ఆరోపణలు వివిధ పార్టీలు చేశాయి. ఆ ఎన్నికల్లో బరిలోకి దిగిన కేఏ పాల్‌కు డిపాజిట్లు కూడా రాలేదు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కేఏ పాల్ ప్ర‌జా యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. జూలై 9 నుంచి దీనికి శ్రీకారం చుట్ట‌బోతున్నారు. విశాఖ‌ప‌ట్నం నుంచి యాత్ర‌ను ప్రారంభించి జూలై 22న క‌ర్నూలులో యాత్ర ముగిస్తారు. ఈ యాత్రలో ఆయ‌న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ప్ర‌జ‌ల నుంచి విన‌తులు, విజ్ఞ‌ప్తులు స్వీక‌రిస్తార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జా శాంతి పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇక పండుగే పండుగ‌ని చెప్పుకుంటున్నారు. యూట్యూబ్ లో కేఏ పాల్ పై ర‌క‌ర‌కాల థంబ్ నెయిల్స్ తో ఉన్న వీడియోలు ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే మంచి కాల‌క్షేపాన్ని అందిస్తున్నాయ‌ని నెటిజ‌న్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్ర‌జా యాత్ర నేప‌థ్యంలో జూలై 9 నుంచి 22 వ‌ర‌కు రోజూ కేఏ పాల్ నుంచి మంచి స్ట‌ఫ్ దొరుకుతుంద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.

కాగా కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరు దాడి చేశారు. దానిపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాని కలిశారు.. కేఏ పాల్‌. బీజేపీ పవన్‌ వెంట ఎందుకు పడుతుందని తాను అమిత్‌ షాని ప్రశ్నించానని.,. అయితే అమిత్‌ షా.. పవనే బీజేపీ వెంట పడుతున్నారని తెలిపారని మీడియాకు చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవినీతిపైన బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో తాము వివిధ రాష్ట్రాల నుంచి 175 మందిని ఎంపీ అభ్యర్థులుగా నిలబెడతామని కేఏ పాల్‌ చెప్పారు. అలాగే ప్రజా శాంతి పార్టీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. వివిధ పార్టీల నుంచి ప్రజా శాంతి పార్టీలోకి భారీగా చేరికలు కూడా ఉంటాయని వివరించారు.