Begin typing your search above and press return to search.

పాల్ హడావుడి వెనుక ఉన్నదెవరు ?

By:  Tupaki Desk   |   22 May 2022 5:15 AM GMT
పాల్ హడావుడి వెనుక ఉన్నదెవరు ?
X
తెలంగాణ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, మత ప్రచారకుడు కేఏ పాల్ ఎంట్రీ విచిత్రంగా ఉంది. పాల్ కు తెలంగాణా రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మతప్రచారకుడిది విజయనగరం జిల్లా కాబట్టి ఏపీ పాలిటిక్స్ లో ఉన్నారంటే అర్ధముంది. తెలుగు రాష్ట్రాల్లో కేఏపాల్ అంటే తెలియని వాళ్ళుండరు. అలాగే ఆయన గురించి ఆలోచించే వాళ్ళూ ఉండరు. విభజన తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఏపీలో కాస్త హడావుడి చేశారంటే అర్ధముంది.

అంతేకానీ ఎలాంటి సంబంధంలేని తెలంగాణా రాజకీయాల్లోకి హఠాత్తుగా ఊడిపడి ఎందుకు హడావుడి చేస్తున్నట్లు ? పైగా కేసీయార్ ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలు చేస్తు రెచ్చిపోతున్నారు. తానేమిటి తొందరలోనే కేసీయార్ కు తెలిసివస్తుందంటు నానాగోల చేస్తున్నారు. అసలు ఏమి చేసుకుని, ఎవరిని చూసుకుని పాల్ ఇంత గోల చేస్తున్నారనే విషయమై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ఈ ప్రచారాల్లో కీలకమైనది ఏమిటంటే పాల్ ను వెనకనుండి నడుపుతున్నది బీజేపీయే అని. ఎందుకంటే తెలంగాణాలోని క్రిస్తియన్ ఓట్ల కోసమే పాల్ ను బీజేపీ ఆడిస్తోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ మధ్యనే సిద్ధిపేట జిల్లాలో పాల్ పైన దాడి జరిగింది. దాడి విషయమై ఫిర్యాదు చేయటానికి అపాయిట్మెంట్ కోరితే డీజీపీ అసలు దగ్గరకే రానీయలేదు. నిజానికి పాల్ స్ధాయి కూడా అంతే. కానీ విచిత్రంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ ఇచ్చేశారు.

సరే ఏదోలా గవర్నర్ ను కలిశారులే అనుకుంటే దానికి మించి ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్ తో దాదాపు అర్ధగంట భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీయార్ అపాయింట్మెంట్ కావాలంటే ఇవ్వటం లేదు. ఏపీలో మిత్రపక్షం జనసేన అధినేత మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నా కలవని అమిత్ షా ఎందుకు పాల్ తో భేటీ అయ్యారు ? జరుగుతున్నది చూస్తున్న తర్వాతే పాల్ ను వెనకుండి బీజేపీయే ఆడిస్తోందనే ప్రచారం పెరిగిపోతోంది. అంతా బాగానే ఉంది కానీ పాల్ చెబితే టీఆర్ఎస్ కు ఓట్లేసే క్రిస్తియన్లున్నారా ?