Begin typing your search above and press return to search.

తల్లికి మాట ఇచ్చా: 1200 కి.మీ. తండ్రిని తీసుకెళ్లిన 'సైకిల్' జ్యోతి

By:  Tupaki Desk   |   30 May 2020 12:30 AM GMT
తల్లికి మాట ఇచ్చా: 1200 కి.మీ. తండ్రిని తీసుకెళ్లిన సైకిల్ జ్యోతి
X
కరోనా - లాక్‌ డౌన్ కారణంగా గాయపడిన తన తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని 1200 కిలో మీటర్లు వెళ్లిన పదిహేనేళ్ల జ్యోతిపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఆమె సాహసం దేశాన్ని దాటింది. ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. జ్యోతి సైక్లింగ్ ప్రతిభను భారత సైక్లింగ్ సమాఖ్య కూడా గుర్తించింది. ఆమెకు ట్రెయినింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ మేథమెటిషియన్ - సూపర్ 30 వ్యవస్థాపకులు ఆనంద్ కుమార్ ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామన్నారు. జ్యోతి ఇంటికి నాయకులు - మీడియా ప్రతినిధులు - సామాజిక కార్యకర్తలు - అధికారుల తాకిడీ ఎక్కువైంది.

తాను అమ్మాయిని కాబట్టి ఇంత స్పందన వస్తోందని - కష్టాల్లో ఉన్నప్పుడు తలుచుకొని బాధపడేకంటే ఏదో ప్రయత్నం చేయాలని - తన తల్లికి ఇచ్చిన మాట కోసం తండ్రిని అంత దూరం తీసుకు వచ్చానని చెప్పింది. లాక్ డౌన్ కారణంగా తనలాంటి వారి పరిస్థితి బాధాకరంగా తయారయిందని చెప్పారు.

తన ఇల్లు చాలా చిన్నది అని - రోజు రోజుకు తన ఇంటికి వచ్చే వారు పెరుగుతున్నారని - దీంతో ఇంటి పక్కనే చిన్న టెంట్ వేసుకున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకుతుందనే ఆందోళన కూడా ఉందని, కానీ రావొద్దని ఎవరికైనా చెబితే గర్వం పెరిగిందని అనుకుంటారని భావించి ఏమీ చేయలేకపోతున్నట్లు తెలిపారు. చాలామంది రావడం వల్ల తన కూతురు నిద్ర సరిగా పోవడం లేదని, తిండి కూడా సమయానికి తినలేకపోతోందని, అయినప్పటికీ అందరిని సంతోషంగా పలకరిస్తోందని తండ్రి చెప్పారు.