Begin typing your search above and press return to search.

పార్టీలు మారినా ప‌ద‌వులు

By:  Tupaki Desk   |   19 July 2021 2:30 PM GMT
పార్టీలు మారినా ప‌ద‌వులు
X
రాజ‌కీయాల్లో నేత‌లు పార్టీలు మార‌డం సాధార‌ణ‌మే. అయితే ఓ పార్టీ నుంచి వ‌చ్చిన నాయ‌కుడికి మ‌రో పార్టీలో కొన్ని కొన్ని సార్లు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌చ్చు. సీనియ‌ర్ల కార‌ణంగా లేదా పార్టీ ప్ర‌యోజ‌నాల కార‌ణంగా వేచి చూడాల్సి రావొచ్చు. కానీ వైసీపీ నేత జూపూడి ప్ర‌భాక‌ర్ రావుకు మాత్రం ఏ పార్టీలో ఉన్న ప‌ద‌వులు ద‌క్కుతూనే ఉన్నాయి. దీంతో ఆయ‌న‌కు అదృష్టం ప‌ట్టుకుంద‌ని అనుకుంటున్నారు. ఇటీవ‌ల ఏపీలో కేటాయించిన నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా ఆయ‌న్ని సామాజిక న్యాయ స‌ల‌హాదారుగా జ‌గ‌న్ నియ‌మించారు.

2014 ఎన్నిక‌ల వ‌ర‌కూ జూపూడి వైసీపీలోనే ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మి చెందారు. అప్పుడు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. అంతే కాకుండా జ‌గ‌న్ పార్టీకి వ్య‌తిరేకంగానూ మాట్లాడ‌టంలో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అప్పుడు జూపూడికి చంద్ర‌బాబు ఎస్సీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు.

గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో జూపూడి తిరిగి వైసీపీ గూటికి వ‌చ్చేశారు. జ‌గ‌న్ కూడా ఆయ‌న‌ను సాద‌రంగానే ఆహ్వానించారు. అయితే ఆ త‌ర్వాత త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌స్తుంద‌ని కొంత‌కాలం, కొండ‌పి ఇన్‌చార్జి ప‌ద‌వి ఇస్తార‌ని మ‌రికొంత కాలం జూపూడి ఎదురు చూశారు. కానీ ఈ రెండు ప‌ద‌వుల రాక‌పోయిన‌ప్ప‌టికీ ఓపిక‌గా ఉన్నారు.

ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ జోరు అందుకోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న‌కు నామినేటెడ్ పోస్టు ద‌క్కింది. అయితే మ‌రోవైపు ఇక ఆయ‌న ఈ ప‌దవితోనే స‌రిపెట్టుకోవాల్సింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు టికెట్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని జ‌గ‌న్ ఈ నామినేటెడ్ పోస్టుతోనే స్ప‌ష్టం చేశార‌ని రాజ‌కీయ వేత్త‌లు అనుకుంటున్నారు. భ‌విష్య‌త్‌లో ఆయ‌న నుంచి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకే జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త‌గా జూపూడికి ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌నే టాక్ వినిపిస్తోంది.