Begin typing your search above and press return to search.

ఏపీ రాజకీయాల్లోకి జూనియర్... ?

By:  Tupaki Desk   |   25 Nov 2021 9:39 AM GMT
ఏపీ రాజకీయాల్లోకి జూనియర్... ?
X
జూనియర్ ఎన్టీయార్ యంగ్ టైగర్. సూపర్ స్టార్. ఆయన సినిమాలకు జనాల్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇక ఎన్టీయార్ నటుడుగానే కాదు, అద్భుతమైన హోస్ట్ గా తనను తాను మీలో ఎవరు కోటీశ్వ‌రులు కార్యక్రమం ద్వారా రుజువు చేసుకుంటున్నారు. ఆయనలోని అసలు మనిషి ఎలా ఉంటారో కూడా జనాలు కళ్లారా చూస్తున్నారు. రాముడు మంచి బాలుడు అన్నట్లుగా జూనియర్ ఎన్టీయార్ తన బిహేవియర్ తో ఈ స్థాయికి ఎదిగారు. ఎన్టీయార్ కి సినిమా ఒక పాషన్. ఆయన తాత సీనియర్ ఎన్టీయార్ వారసత్వం ఎంత కలసివచ్చినా ఈ రోజున ఈ స్థాయికి రావడానికి మాత్రం తాను పడిన కష్టమే నూటికి నూరు శాతం ఉందని అంతా చెబుతారు. అలాంటి ఎన్టీయార్ ఇపుడు పూర్తిగా సినిమాలకే అంకితం అయ్యారు. వివాదాలకు దూరంగా వినోద ప్రపంచానికి దగ్గరగా ఉంటున్న జూనియర్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో మళ్లీ గట్టిగా నానుతున్నారు.

నిజానికి జూనియర్ కి ప్రస్తుతానికైతే రాజకీయాల మీద ఆసక్తి లేదు, ఆయన మొత్తం దృష్టి అంతా సినిమాల మీదనే ఉంది. ఇంకా వయసు చాలా ఉంది. చేయాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో మెట్టూ ఎక్కి ఇంతదాకా వచ్చిన జూనియర్ తాతలా చిర స్థాయి కీర్తిని ఆర్జించాలని ఉబలాటపడుతున్నారు. ఇక రాజకీయాలు అనేవి ఇపుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. అలాగని జూనియర్ రాడు అని చెప్పేయడం కాదు కానీ ఇప్పటికైతే ఆయన ఆ వైపు అసలు చూడరనే భావన ఉంది. ఇక జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అయితే గట్టిగా కోరుకుంటోంది.

దానివల్ల జూనియర్ కి ఏం లాభం, ఆయన తన ఇమేజ్ ని ఫణంగా పెట్టి ఒక పార్టీకి మద్దతుగా నిలిచి కొందరి వాడిగా మిగిలితే కలిగే డ్యామేజ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే జూనియర్ ఆ వైపు తొంగి చూడడంలేదు. ఈ మధ్య ఏపీ అసెంబ్లీలో జరిగిన కొన్ని ఘటనలు, చంద్రబాబు కుటుంబం మీద వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారని టీడీపీ యావత్తు రగులుతోంది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వంటి వారు అయితే ఈ విషయంలో జూనియర్ ని లాగేశారు. జూనియర్ సొంత మేనత్తను వైసీపీ నేతలు దారుణంగా అంటే తాపీగా సుభాషితాలు వల్లించడమేంటి అని మండిపడ్డారు. బాబు మేనల్లుడిగా జూనియర్ స్పందన బాగులేదని కూడా ఘాటు కామెంట్స్ చేశారు.

జూనియర్ కి సన్నిహితులుగా వైసీపీ మంత్రి కొడాలి నానిని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పేర్కొంటూ వారిని మందలించి ఉండాల్సింది అని కూడా వర్ల రామయ్య అన్నారు. అంటే బాబుని వైసీపీ నేతలు అనడం తప్పు అయితే అంతకంటే పెద్ద తప్పు జూనియర్ చేశాడన్నట్లుగా వర్ల కామెంట్స్ ఉన్నాయి. దీని మీద కొండాలి నాని గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తామూ జూనియర్ సన్నిహితులు అని ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నించారు. ఒకపుడు జూనియర్ తో సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే కానీ ఇపుడు మాత్రం విడిపోయామని చెప్పి సంచలనం రేకెత్తించారు.

అసలు జూనియర్ తమను కంట్రోల్ చేయడమేంటి, తాము వినడమేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ని అటు టీడీపీ ఇటు వైసీపీ లాగేస్తున్నాయి. మరి చంద్రబాబు ఏడుపు మీద స్పందించి ఒక వీడియో విడుదల చేసి తన బాధ్యతను చాటుకున్న జూనియర్ ఈ మకిలి రాజకీయాలు దూరం అని చెప్పకనే చెప్పేశారు. అయినా ఆయన్ని వదలకుండా టీడీపీ కామెంట్స్ చేయ‌డం, ప్రతిగా వైసీపీ కూడా జూనియర్ విషయం ప్రస్థావించడంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరి వీటన్నిటి మీద జూనియర్ పెదవి విప్పుతారా.. చూడాలి.