2022 నుంచి.. జెట్ ఎయిర్ వేస్ 2.0

Mon Sep 13 2021 19:20:57 GMT+0530 (IST)

Jet Airways 2.0 From 2022

జెట్ ఎయిర్ వేస్.. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద వైమానిక సంస్థగా రాజిల్లిన విషయం తెలిసిందే. అయితే.. వివిధ ఆర్థిక సమస్యలతో 2019నాటికి ఈ సంస్థ కునారిల్లిపోయింది. పోటీని తట్టుకోలేక ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించలేక వెనుకబడింది. అయితే.. ఇప్పుడు ఈ సంస్థ తిరిగి పుంజుకుని.. వాయు మార్గంలో సేవలు అందించేందుకురెడీ అవుతోంది. బ్రిటన్‌కు చెందిన జలాన్ కాల్‌రాక్ కన్సార్టియమ్ ఈ వైమానిక సంస్థకు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించడంతో .. త్వరలోనే జెట్ ఎయిర్ వేస్ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 2022 తొలి త్రైమాసికంలోనే జెట్ ఎయిర్ వేస్ విమానాలు సేవలు అందించనున్నాయి. ఈ కన్సార్టియమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న జెయ్ ఎయిర్‌వేస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యూఏఈకి చెందిన వ్యాపార వేత్త మురారి లాల్ జలాన్ చెప్పిన దానిని బట్టి.. 2022లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ``జెట్ ఎయిర్‌వేస్ 2.0 లక్ష్యం మేరకు 2022-తొలి త్రైమాసికంలోనే డొమెస్టిక్ ప్రయాణాలకు అవకాశం ఉంది. అనంతరం మూడే లేదా.. నాలుగో త్రైమాసికం నాటికి అంతర్జాతీయ సేవలను కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నాం`` అని వివరించారు.

వైమానిక రంగంలో దాదాపు రెండేళ్లపాటు ఒక సంస్థ ఈ స్థాయిలో ఇబ్బందులు పడడం ఇదే తొలిసారని.. ఆయన చెప్పారు. అయితే.. ఇప్పుడు పుంజుకోవడం తిరిగి యథాతథంగా కార్యకలాపాలు ప్రారంభించడం.. సంతోషకరంగా ఉందన్నారు.  జూన్ మొదట్లో.. జెట్ ఎయిర్‌వేస్ విషయాన్ని నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్(ఎన్ సీ ఎల్ టీ) పరిశీలించింది. అప్పటి నుంచి ఈ కంపెనీ.. సంబంధిత అధికారులతో కలిసి పనిచేసింది. ముఖ్యంగా ఎయిర్ పోర్టు కో ఆర్డినేటర్స్ మౌలిక వసతులు నైట్ పార్కింగ్.. ఇలా అన్ని విషయాలను గమనంలోకి తీసుకుంది.  2.0 అవతార్ జెట్ ఎయిర్ వేస్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉండగా మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు వంటివి గుర్గావ్ నుంచి నిర్వహించనున్నారు.