గ్రేటర్ ఫైట్: బీజేపీకి లొంగిపోయిన పవన్ కళ్యాణ్?

Fri Nov 20 2020 21:00:31 GMT+0530 (IST)

Greater Fight: Pawan Kalyan surrenders to BJP?

అమరావతి సాక్షిగా తెలంగాణలోని హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ల చివరి రోజు మాట మార్చేశారు. తాము జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని.. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం రాజకీయంగా సంచలనమైంది.ఏపీ తెలంగాణల్లో బీజేపీతో కలిసి పనిచేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన జనసేన.. నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవాలన్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసైనికులు నిరాశ పడొద్దన్న ఆయన.. ఈ ఒక్క ఓటు కూడా పోకుండా బీజేపీకి సహకరించాలని కోరారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందని.. హైదరాబాద్ లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరంతోనే తాము బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని పవన్ ప్రకటించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని నాదెండ్ల మనోహర్ నివాసంలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతివ్వాలని.. జనసేన తరుఫున పోటీ పెట్టవద్దని వారు కోనినట్లు తెలిసింది.

ఈ సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి జనసేన వైదొలుగుతోందని.. బీజేపీకే పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. తాజా ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ఓటు బయటకు పోవద్దని.. భవిష్యత్తులోనూ ఇరు పార్టీలు కలిసి వెళ్తాయని స్పష్టం చేశారు.