Begin typing your search above and press return to search.

మిత్రుడికి దిమ్మ తిరిగే షాకిస్తూ.. ఉద్యమ గోదాలోకి దిగిన పవన్

By:  Tupaki Desk   |   20 Sep 2021 11:32 AM GMT
మిత్రుడికి దిమ్మ తిరిగే షాకిస్తూ.. ఉద్యమ గోదాలోకి దిగిన పవన్
X
గెలుపే ముఖ్యమని అందరూ అనుకుంటారు. కానీ.. కొందరు మాత్రం.. ఆ గెలుపులో న్యాయం.. ధర్మం లాంటివి పక్కాగా పాటించాలని కోరుకుంటారు. మార్పు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. ఆ ప్రాథమిక సూత్రాన్ని పక్కన పెట్టేయటానికి మించిన ఫెయిల్యూర్ లేదన్న భావన పవన్ లో కనిపిస్తుంది. పవన్ ను చాలామంది విఫల రాజకీయ నేతగా మాత్రమే చూస్తారు. బ్యాడ్ లక్ ఏమంటే.. అతగాడి రాజకీయాల్ని.. అతడి ఆలోచనల్ని మీడియా సైతం సరైన రీతిలో అర్థం చేసుకోలేదనే చెప్పాలి.

ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి? అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. గెలుపు కోసం.. విజయంతో అధికారాన్ని సొంతం చేసుకోవటమే లక్ష్యమైనప్పుడు నడిచే దారి గురించి చాలామంది అస్సలు ఆలోచించరు. కానీ.. జనసేన అధినేత తీరు మాత్రం అందుకు భిన్నం. రాజకీయాల్ని మార్చాలన్న లక్ష్యంతో వచ్చిన పవన్..ఎన్నికల వేళ ఓటర్లకు పైసా ఖర్చు చేసేందుకు ఇష్టపడరు. అంతేకాదు.. మిగిలిన పార్టీల మాదిరి మద్యం సీసాలు.. ఓట్లకు నోట్లు పంచటం లాంటి వాటికి పూర్తి వ్యతిరేకం.

ఈ కారణమే.. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయేలా చేసింది. అందరూ పవన్ ఓటమినే చూశారు కానీ.. ఆయన ఓడిపోవటం ద్వారా.. నైతికంగా గెలిచారని చెప్పాలి. ఎందుకంటే.. తాను నమ్మిన బాటలో నడిచే క్రమంలో ఓటమిని సైతం ఒప్పుకోవటానికి చాలానే ధైర్యం కావాలి. అలాంటివి తన దగ్గర టన్నుల కొద్దీ ఉన్నట్లుగా పవన్ తీరు ఉన్నా.. దాన్ని ఫోకస్ చేసే విషయంలో మీడియా తన పని తాను చేయలేదన్న మాట వినిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా జనసేనాని పవన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ తరహా ప్రకటన కోసమే చాలామంది ఎంతో్కాలంగా ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన.. ఆ తర్వాత మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకోవటం.. మిత్రుడిగా మారటం తెలిసిందే. ఏపీ ప్రయోజనాలు పెద్దగా పట్టని మోడీ సర్కారుతో రాష్ట్రానికి నష్టమేనన్న విషయం అర్థమవుతున్నా.. పవన్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

దీనికి తగ్గట్లే.. ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కాస్త భిన్నంగా వ్యవహరిస్తోందన్న సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే విషయంలో ఏపీ ప్రజల మనోభావాలకు భిన్నంగా వ్యవహరిస్తోన్న తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఫీడ్ బ్యాక్ పవన్ కు అందుతున్నా.. ఆయన ఈసారి మాత్రం తొందరపడలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ప్రజల్లో ఆగ్రహం ఒక స్థాయి వరకు వచ్చే వరకు ఆగటం.. విశాఖ ఉక్కు విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన టైం కోసం చూస్తున్నారు.

తాజాగా ఆయన కోరుకున్న టైం వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయించిన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు జనసేనాని తాజాగా ఉద్యమ గోదాలో దిగనున్నట్లు స్పష్టం చేయటమే కాదు.. దానికి సంబంధించిన భారీ ప్రణాళికను ఆయన తాజాగా విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్రం మరోసారి పునరాలోచన చేయాలన్న డిమాండ్ తో పాటు.. ఉక్కు కర్మాగారం భావోద్వేగాలతో ముడి పడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. నిర్వాసితుల బాధలు.. కష్టాలు తనకు తెలుసన్న ఆయన.. ఆ దిశగా తాము పోరాడతామన్న విషయాన్ని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ ను విడుదల చేశారు. మొత్తంగా మిత్రుడికి షాకిస్తూ.. విశాఖ ఉక్కు అంశం మీద తనకు తాను బరిలోకి దిగిన జనసేనాని.. ఈ ఇష్యూని ఎక్కడి వరకు తీసుకెళతారు? ప్రైవేటీకరణను ఎలా ఆపుతారన్నది అసలు ప్రశ్నగా మారిందని చెప్పాలి.