ఉనికి కోసమేనా జనసేన ఆందోళన?

Thu Apr 25 2019 16:05:27 GMT+0530 (IST)

Janasena activists stage protest at Pragathi Bhavan

ఏదైనా సమస్య మీద రాజకీయ పార్టీలు ధర్నాలు.. ఆందోళనలు.. నిరసనలు చేపట్టటం కామన్. గడిచిన కొద్దిరోజులుగా ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం మీదా.. విద్యార్థుల జీవితాల్ని ప్రభావితం చేసేలా  దొర్లిన తప్పుల మీద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైనం తెలిసిందే. కాంగ్రెస్.. బీజేపీలతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు దగ్గర ఆందోళనలు నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉంటే.. బుధవారం సాయంత్రం.. గురువారం ఉదయం ప్రభుత్వం నుంచి.. ఇంటర్ బోర్డు నుంచి రెండు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. బుధవారంతో పోలిస్తే ఈ రోజు(గురువారం) ఉదయం విడుదలైన ప్రకటన స్పష్టంగా ఉండటమే కాదు.. ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల అందరి ఆన్సర్ షీట్లను మరోసారి వెరిఫికేషన్ చేసి.. కొత్త మార్కుల లిస్టును పంపుతామని.. ఇందుకోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చింది.

ఇంటర్ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కోరుతున్నట్లే.. ప్రభుత్వం వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు  కాస్త ఆలస్యమైనా.. మొత్తం ఇష్యూ క్లోజ్ చేసే ప్రయత్నంచేసింది. ఇదిలా ఉంటే.. ఇష్యూ మొత్తం సమిసిపోయే వేళ.. జనసేనకు చెందినకొందరు కార్యకర్తలు ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ వద్ద ఆందోళన చేయటం ఆసక్తికరంగా మారింది.

ఇంటర్ ఫలితాల విడుదలతో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రగతిభవన్ వద్ద నిరసనను నిర్వహించారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు అక్కడకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లు ఇచ్చారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహల్ స్టేషన్ వద్దకు తరలించారు. ఇంతకీ.. ఇంటర్ ఇష్యూ మీద ఇవాళ ఆందోళన చేయాలన్న ఆలోచన జనసేనకు ఎందుకు వచ్చినట్లు? అన్న ప్రశ్న ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల బరిలో దిగనున్న జనసేన.. తన ఉనికిని ప్రదర్శించుకోవటానికి.. యువత.. వారి తల్లిదండ్రుల సానుకూలత కోసమే తాజా ఆందోళన చేపట్టినట్లుగా చెబుతున్నారు. ఇంటర్ వ్యవహారం మీద అంత కమిట్ మెంట్ ఉంటే.. ఆదివారం నుంచి ఆందోళనలు ఎందుకు చేపట్టనట్లు..?