బీజేపీ తో జనసేన భేటీ ... కారణం చెప్పిన జీవీఎల్ !

Tue Jan 21 2020 16:47:54 GMT+0530 (IST)

Jana Sena meeting with BJP ...

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం పై రాజకీయం వేడెక్కిపోతోంది. పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు అని వైసీపీ ప్రభుత్వం చెప్తుంటే ..అమరావతి నుండి రాజధానిని తరలించడానికి మేము ఒప్పుకోము అని టీడీపీ ఆందోళన చేస్తుంది. ఈ వ్యవహారం ఇలా సాగుతున్న సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనసేన బీజేపీ పార్టీల భావజాలం ఒక్కటేనని చెప్తూ జనసేన బీజేపీతో కలిసి పనిచేయబోతున్నట్టు ప్రకటించాడు.ఈ నేపథ్యంలోనే రేపు జనసేన బీజేపీ మధ్య కీలక సమావేశం జరగనుంది. దీనితో అందరూ కూడా ఈ భేటీ ఏపీ మూడు రాజధానుల వ్యవహారం పై చర్చించడానికే అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. అయితే రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని మార్పుతో కేంద్రం ఎవరితోనూ ఎటువంటి సమావేశం జరపడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జనసేన పార్టీతో రేపటి సమావేశం కేవలం సమన్వయ కమిటీ సభ్యుల ఎంపిక కోసం మాత్రమేనని తెలిపారు.

రాజధాని అంశంతో ఈ సమావేశానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తామని తెలిపారు రాజధాని కోసమే రేపు జనసేనతో సమావేశం అన్నది పూర్తిగా అవాస్తమని వెల్లడించారు. అయితే కొన్ని మీడియాలు దురుద్దేశ పూర్వకంగానే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.... అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అదే విధంగా సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లు ను కూడా ఆమోదించింది.