Begin typing your search above and press return to search.

దేశంలో మళ్లీ తెరపైకి ‘‘జమిలి ఎన్నికల’’ఆలోచన?

By:  Tupaki Desk   |   23 Nov 2021 12:30 PM GMT
దేశంలో మళ్లీ  తెరపైకి ‘‘జమిలి ఎన్నికల’’ఆలోచన?
X
ఒక దేశం.. 29 రాష్ట్రాలు.. అనేక సార్లు ఎన్నికలు.. ఒకసారి లోక్ సభకు.. మరోసారి అసెంబ్లీకి.. మధ్యలో ఉప ఎన్నికలు.. కొందరు ముందస్తుకు.. మరికొందరు సాధారణానికి.. ఇలా అయిదేళ్ల కాల పరిమితిలో ఎన్నో ఎన్నికలు... ఎంతో ప్రజా ధనం వేస్ట్.. అంతకుమించి సమయం.. ఈ పరిస్థితిని నివారించేందుకు పుట్టుకొచ్చిన ఆలోచనే... జమిలి ఎన్నికలు. అంటే.. లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్నది ఆ ఆలోచన.

ఒక్కసారి ఎన్నిక పూర్తయితే మళ్లీ అయిదేళ్ల వరకు ఢోకా లేకుడా.. మధ్యలో ఎన్నికనేది లేకుండా చేసే ప్రయత్నమిది. ఓ విధంగా చెప్పాలంటే మంచి ప్రయత్నమే. అందులోనూ ప్రతి ఆర్నెళ్లకు మూన్నెళ్లకు దేశంలో ఏదో ఒక మూలన ఎన్నికలు జరిగే ప్రజాస్వామ్య భారతంలో ఇలాంటి ఆలోచనను మెచ్చుకోవాల్సిందే.

సాధ్యమా? అనే అనుమానం?

కోటి కాదు రెండు కోట్లు కాదు వంద కోట్ల మంది ఓటర్లు.. భిన్న భౌగోళికత. అంతకుమించిన ఆలోచనా ధోరణులు.. బహుళ రాజకీయ వ్యవస్థ. వీటన్నిటి నేపథ్యంలో దేశంలో అసలు జమిలి ఎన్నికలు సాధ్యమా? అనే అనుమానం మొదట్నుంచి ఉంది. ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఆ ఆలోచన ముందుకుసాగుతుందా? అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ప్రయత్నం మంచిదంటూ ఓవైపు సమర్థనలు, బాగోలేదంటూ విమర్శలు వచ్చాయి.

ఇప్పడు జమిలికి సిద్ధమవుతున్నారా?

అయితే, దేశంలో అనూహ్యంగా మారుతున్న రాజకీయం.. మళ్లీ జమిలి ఎన్నికల ఆలోచనలకు ఊతమిస్తోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్యమాలకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వాలు తహతహలాడుతున్నాయి. గతేడాది తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఉప సంహరణపై తగ్గేది లేదన్న కేంద్రం.. ఊహించని విధంగా వాటిని వెనక్కు తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులతో ఎంతకైనా వెళ్లింది కానీ.. మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని చెప్పినా చివరికి ఉపసంహరించుకుంది. మళ్లీ బిల్లులు పెడతామని చెబుతోంది. మరో వారంలో ప్రధానమంత్రి మోదీ అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, అది జమిలి ఎన్నికల నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణకే అన్న చర్చ జరుగుతోంది.

రెండోసారి అఖిలపక్షం

కేంద్రంలో రెండోసారి గెలిచిన తర్వాత మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పూర్తిగా జమిలి ఎన్నికలపై అభిప్రాయ సేకరణకే సాగింది. దీనికి అన్ని పార్టీలు అంగీకరించాయి. అంతకుముందు వ్యతిరేకించిన టీడీపీ లాంటి పార్టీలు కూడా ఒప్పుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తోంది.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం లేదు. ఎందుకంటే జమిలి ఎన్నికలు జరిపితే.. ప్రాంతీయ పార్టీలకే నష్టం కానీ జాతీయ పార్టీలు లాభపడతాయన్న ఆలోచనలో ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. అదింకా పైకే వెళ్తుంది.. అందుకే ముందుజాగ్రత్త పడుతున్నట్లుగా భావిస్తున్నారు.

బీజేపీ, అనుబంధ పార్టీల హడావుడి అందుకేనా?

తెలంగాణలో కేసీఆర్ కానీ, ఏపీలో జగన్ కానీ ఆఖరుకు కేంద్రంలో మోదీ కానీ తమ నిర్ణయాలను హడావుడిగా వెనక్కు తీసుకోడానికి కారణం జమిలి ఎన్నికలు తరుముకొస్తుండడమే అని భావిస్తున్నారు. వాస్తవానికి జమిలి ఎన్నికలను ఎలాగైనా అమలు చేయాలన్న పట్టుదలతో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది.

ఒక్క రాజ్యాంగ సవరణ చేస్తే మొత్తం ప్రక్రియ సజావు అవుతుంది. ఎన్నికల కమిషన్ కూడా తాము సిద్దంగా ఉన్నామని గతంలోనే చెప్పింది. అందుకనే బీజేపీతో పాటు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలు హడావుడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

వచ్చే శీతాకాల సమావేశాల్లో కొలిక్కి..

ప్రస్తుత పరిణామాల రీత్యా.. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కీలకం కానున్నాయి. సాగు చట్టాల ఉప సంహరణ బిల్లులు ఈ సమావేశాల్లోనే సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలోనే జమిలి ఎన్నికలపైనా స్పష్టత రానుంది. ఇందుకు ఇంకా ఎంతో సమయం లేదు.

రెండు, మూడు వారాల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బహుశా… పార్లమెంట్ సమావేశాల్లోనే కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.