Begin typing your search above and press return to search.

జై జవాన్ .. 'వో హై గల్వాన్‌ కే వీర్‌' రియల్ హీరోస్ అంటున్న ఇండియన్ ఆర్మీ

By:  Tupaki Desk   |   16 Jun 2021 7:30 AM GMT
జై జవాన్ .. వో హై గల్వాన్‌ కే వీర్‌ రియల్ హీరోస్ అంటున్న ఇండియన్ ఆర్మీ
X
ప్రాణాలు పోతాయని తెలిసినా భారత జవాన్లు , దేశం కోసం తమ ప్రాణాలని కూడా లెక్క చేయలేదు , కట్టు తప్పలేదు. నిబంధనలను వీడలేదు. చైనా సైనికులు మారణాయుధాలతో దాడికి దిగినా, కొదమసింహాల్లా ఎదురు నిలిచారు. ఖాళీ చేతులతోనే శత్రువులను మట్టి కరిపించారు. వీరు 100 మంది. అవతలి వైపు 300ల మంది. అయినా ఏ మాత్రం భయం అనేది లేకుండా శత్రు వర్గానికి రెట్టింపు నష్టం కలిగించారు. ఈ క్రమంలో 20 మంది జవాన్లు అమరులయ్యారు. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు ఇవి. చైనా జవాన్లు ఇనుపచువ్వలు బిగించిన రాడ్లతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. భార‌త సైనికుల‌పై మెరుపు వేగంతో దాడి చేశారు. చైనా వెన్నుపోటు పొడిచినా.. భార‌త ఆర్మీ వెంటనే అప్రమత్తమైంది. జూలు విదిల్చిన సింహంలా విజృంభించింది. ఈ ఘర్షణలో కల్నల్‌ సంతోశ్‌కుమార్‌తో పాటు 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా వైపు యాభై మందికి పైగా చనిపోయినట్టు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.

లద్ధాఖ్‌ లో గల్వాన్‌ లోయలో ఇండియా, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా ఇండియన్‌ ఆర్మీ వీడియో రిలీజ్‌ చేసింది. వో హై గల్వాన్‌ కే వీర్‌ పేరుతో ఇండియన్‌ ఆర్మీ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. హరిహరన్‌, సోనూనిగమ్‌ లతో కూడిన గాయకుల బృందం ఈ పాటను ఆలపించగా , ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇండియన్‌ సైనికులు ఏ విధంగా గస్తీ కాస్తూ దేశ భద్రతను కాపాడుతున్నారనే విషయాల్ని వీడియోలో కళ్లకి కట్టినట్టు చూపించారు. చివరగా గల్వాన్‌ పోరాటంలో అమరులు ఈ వీడియోలో కనిపిస్తారు.