Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తిరుగుబాటు.. అధిష్టానం సీరియస్

By:  Tupaki Desk   |   25 Sep 2021 9:30 AM GMT
రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తిరుగుబాటు.. అధిష్టానం సీరియస్
X
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టాయి. అసమ్మతి రాజేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం సైతం జగ్గారెడ్డిపై సీరియస్ అయినట్టు సమాచారం. రేవంత్ పై జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ ఆరాతీసినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం గాంధీభవన్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి కామెంట్లపై సీరియస్ గా చర్చించాలని రాష్ట్ర నేతలను మాణిక్యం ఠాకూర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో ఠాకూర్ వివరాలు తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ రానున్న ఠాకూర్ దీనిపై శూలశోధన చేపట్టనున్నారు.

రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వెళ్లగక్కిన జగ్గారెడ్డి తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటన ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా ఒకరి నెత్తిన మరొకరు చేయి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీనా..? లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కూడా పార్టీలో గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీనియర్లు అందరూ తెలంగాణ పీసీసీ చీఫ్ కోసం పోటీపడ్డా అందరినీ కాదని యువకుడు.. పక్కపార్టీ నుంచి వచ్చినా సరే రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్ చేసింది అధిష్టానం. అయితే ఆయన కూడా అధిష్టానం ఆకాంక్షలను వమ్ము చేయకుండా దూకుడుగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి దూకుడు, తీరు నచ్చక సీనియర్లు అసమ్మతి రాజేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి సైతం తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యి పోస్టుమార్టం మొదలుపెట్టింది.