భోజనానికి పిలిచి చిరును బద్నాం చేశారా?

Sun Jan 23 2022 14:13:41 GMT+0530 (IST)

Jagans silence is a sign of what

భోజనానికి తమ ఇంటికి రావాలని ఆహ్వానిస్తే ఏం చేస్తాం? తెలిసిన వారే అయితే.. పిలిచింది భోజనానికే కదా అని వెళతాం. పరిచయం తక్కువైతే.. ఫర్లేదులెండి మరోసారి కలుద్దామని చెబుతాం. కానీ.. పిలిచింది పవర్ ఫుల్ ముఖ్యమంత్రి అయినప్పుడు.. సినిమా ఇండస్ట్రీకి పదే పదే షాకులు ఇస్తున్న ప్రభుత్వానికి అధినేత నుంచి పిలుపు వచ్చినప్పుడు.. అందరిని కలుపుకుపోదాం.. అజాతశత్రువుగా ఉందామని ఫీలయ్యే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు కాదనగలరా? ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి లంచ్ కు రావాలన్న పిలుపునకు.. ఆయన ఊహించినట్లే సానుకూల సందేశం వచ్చింది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.తనను ఏపీ ముఖ్యమంత్రి భోజనానికి ఆహ్వానించటంతో చిరు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అది కూడా ఓకే. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం నివాసానికి వెళ్లారు. దాన్ని తప్పు పట్టలేం. భోజనం.. ఆ తర్వాత భేటీ.. ఇలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొని చివరకు ఇంటికి బయలుదేరారు చిరు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన కోసం మీడియా ఎదురుచూస్తూ ఉండటం.. సీఎం జగన్ నివాసానికి వెళ్లే ముందు.. తిరిగి వచ్చేటప్పుడు మాట్లాడతానన్న చిరు.. అందుకు తగ్గట్లే మాట్లాడారు.

ఆ రోజు చిరు మాటల్ని మరోసారి గుర్తు చేసుకుంటే.. ‘‘టికెట్ల ధరల సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో నన్ను రమ్మని సీఎం ఆహ్వానించారు. పండగ పూట ఈ సమావేశం సంతృప్తిగా సాగింది. నన్ను ఒక సోదరుడిలా ఆహ్వానించారు. జగన్ సతీమణి భారతి స్వ యంగా వడ్డించారు.

 ఇద్దరూ ఒక కుటుంబ సభ్యుడిలా మర్యాదలు చేశారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. నేను చెప్పిన అన్ని సమస్యలను జగన్ సానుకూలంగా విన్నారు. రాసుకున్నారు. ఒకరి పక్షాన గాక అందరి వైపు ఉంటానని ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు.

 టికెట్ ధరల జీవోపై పునరాలోచన చేస్తామని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు వివరించాను. జగన్ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చింది. సినీ పరిశ్రమవారు ఎవ రూ అభద్రతాభావానికి లోనుకావద్దు. రెండు మూడు వారా ల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుంది. నిర్ణయం తీసుకునేలోగా మరోసారి కలసి మాట్లాడుదామని జగన్ చెప్పారు’’ అని వ్యాఖ్యానించారు.

ఆసక్తికర అంశం ఏమంటే.. సీఎం జగన్ తో భేటీ అయి.. హైదరాబాద్ కు తిరిగి వచ్చేసిన తర్వాత.. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక మీడియా సంస్థలో.. చిరుకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లుగా వార్త వచ్చింది. అదెలా వస్తుంది? చిరు కలిసింది తాము అనుకూలంగా ఉండే జగన్ తో అయినప్పడు.. చిరు ఇమేజ్ దెబ్బ తీసే వార్త ఎందుకు వస్తుంది.

జగన్ ప్రభుత్వానికి నష్టం వాటిల్లే ఏ వార్తను పబ్లిష్ చేయని సదరు మీడియా సంస్థలో.. చిరుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లుగా ఊహాజనిత వార్తను రాయటంతో అది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. కొద్ది గంటల వ్యవధిలోనే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని.. రాజకీయాల విషయంలో తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పాల్సి వచ్చింది.

ఈ రచ్చ ఒక కొలిక్కి వస్తుందన్న వేళలోనే.. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం నివాసానికి చిరు ఎందుకు వచ్చారో చెప్పి అందరూ అవాక్కు అయ్యేలా చేశారు. లంచ్ కోసం వచ్చిన చిరంజీవి.. సినిమా టికెట్ల మీద చర్చ జరపలేదని.. భోజనం చేసి.. కుశల ప్రశ్నలు వేసుకొని వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. ‘‘జగన్ నివాసానికి చిరంజీవి ఏదో భోజనానికి వచ్చారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సినిమా టికెట్లపై సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయికానీ ఇం ట్లో జరుగుతాయా? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వమా?’’ అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం?

ఓవైపు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లుగా జగన్ అనుకూల మీడియా వార్త వండితే.. మరికొద్దిరోజులకు భోజనం చేసి వెళ్లారు.. ఇంకేం మాట్లాడుకోలేదని బాధ్యతగా ఉండాల్సిన మంత్రి నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం.. ఈ రెండు కూడా చిరును బద్నాం చేసేలా ఉండటం గమనార్హం. తన ఇంట్లో జరిగిన భోజనం వ్యవహారంపై తన మంత్రి మాట్లాడిన వైనంపై సీఎం జగన్ స్పందించలేదంటే.. అది దేనికి సంకేతం? తన ఇంటికి వచ్చిన వారి విషయంలో ఏమైనా చెప్పాల్సి వస్తే సీఎంవో చెప్పటం ఉండాలి కానీ.. మంత్రి చెప్పటం అంటే.. పేర్ని నాని మాటలకు సీఎం జగన్ ఆమోదం ఉందా? అన్నది ప్రశ్న.

 ఇదంతా చూస్తే..చిరంజీవిని భోజనానికి పిలిచి బద్నాం చేయటం తప్పించి.. మరింకేమీ జరగలేదని మాత్రం చెప్పక తప్పదు.