గర్వంగా ఉందంటున్న జగన్... విపక్షాలకు కౌంటరేనా...?

Mon Aug 15 2022 15:18:10 GMT+0530 (IST)

Jagan who says he is proud opposition counter

ఏపీలో మూడేళ్ళు పైబడిన జగన్ పాలనను చూసి విపక్షాలు ఎకసెక్కం చేస్తాయి. జగన్ కి అసలు ఏ కోశానా  పాలన చేతకాదు అని చంద్రబాబు తరచూ విమర్శిస్తారు. ఇక జగన్ కి ఏమి తెలుసు బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడం తప్ప అని రీసెంట్ గా బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఘాటుగానే సెటైర్లు వేశారు.జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే పాలన అంటే అరకొర సంక్షేమమేనా జగన్ అంటూ నిగ్గదీస్తూ వస్తున్నారు. మరి అందరికీ ఒకే దెబ్బకు కౌంటర్ అన్నట్లుగా జగన్ విజయవాడలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేళ చేసిన ప్రసంగం ఉంది అంటున్నారు.

మూడేళ్ళ తన పాలన చాలా  గర్వంగా ఉందని జగన్ గట్టిగా చెప్పుకోవడం ఒక విధంగా విపక్షాలకు సరైన సమాధానం అని అంటున్నారు. తన పాలనలో ఎన్నో మార్పులు చేర్పులూ  తీసుకువచ్చామని ఆయన చెప్పుకున్నారు.

అంతే కాదు కేవలం మూడేళ్లలో 95 శాతం పైగా హామీలను అమలు చేసిన ఘనత కూడా తనదే అని చెప్పారు. ఎన్నికల ప్రణాళికను ఒక బైబిల్ గా భగవద్గీతగా ఖురాన్ గా భావించి పవిత్రంగా దాన్ని తుచ తప్పకుండా అమలు చేశామని జగన్ చెప్పుకున్నారు

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల వద్దకే పధకాలు అన్నీ తీసుకెళ్ళి నేరుగా ఇంటికి అందిస్తున్నామని చెప్పారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా తాము సంక్షేమాన్ని ఏపీలో చేసి చూపిస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా జగన్ మరోసారి టీడీపీ అనుకూల మీడియా మీద నిప్పులు చెరిగారు. టీడీపీకి అనుకూలంగా కొందరు  వక్రభాష్యాలు రాస్తున్నారని ఒక పార్టీకి చెక్క భజన చేస్తున్నారు అని ఆయన విమర్సించారు. వారు స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారు తప్ప ప్రజల కోసం మీడియాను నిర్వహించడంలేదు అని జగన్ మండిపడ్డారు.