Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురు త‌ప్పితే అంద‌రు మంత్రులూ ఇంటికే...!

By:  Tupaki Desk   |   13 Oct 2021 4:30 PM GMT
ఆ న‌లుగురు త‌ప్పితే అంద‌రు మంత్రులూ ఇంటికే...!
X
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌స‌రా త‌ర్వాత సంక్రాంతికి మ‌ధ్య‌లో ఎప్పుడు అయినా త‌న మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేసేందుకు రెడీ అవుతున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఉన్న మంత్రుల్లో 90 శాతం మందిని మార్చి.. వారి స్థానాల్లో కొత్త వారికి అవ‌కాశం ఇస్తాన‌ని ఓపెన్‌గానే చెప్పారు. ఈ రెండున్న‌రేళ్ల‌లో జ‌గ‌న్ కేబినెట్లో ఎంద‌రు మంత్రులు ? త‌మ ప‌ద‌వుల‌కు న్యాయం చేశారు ? ప్ర‌భుత్వానికి, పార్టీకి ఉప‌యోగ‌ప‌డ్డారు ? అన్న‌ది ప్ర‌శ్నించుకుంటే ఇద్ద‌రు, ముగ్గురు మంత్రులు మిన‌హా ఎవ్వ‌రూ కూడా జ‌గ‌న్ త‌మ‌పై పెట్టుకున్న అంచ‌నాలు ఏ మాత్రం అందుకోలేక‌పోయారు.

ఇక జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి రెండున్న‌రేళ్లు అవుతోంది. ఇక మంత్రివ‌ర్గంలో మార్పులు, చేర్పుల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. జ‌గ‌న్ సైతం ఇంటిలిజెన్స్ రిపోర్టుల ద్వారా ఎవ‌రిని మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించాలి ? ఎవ‌రిని కొత్త‌గా కేబినెట్లోకి తీసుకోవాల‌నేదానిపై స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల మంత్రి బాలినేని జ‌గ‌న్ నూటికి నూరు శాతం కేబినెట్‌ను మార్చేస్తున్నార‌ని.. త‌న మంత్రి ప‌ద‌వి కూడా ఉండ‌ద‌ని బాంబు పేల్చారు. బాలినేని జ‌గ‌న్‌కు స‌మీప బంధువు. ఆయ‌నే ఇంత మాట అన‌డంతో మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న వారిలో చాలా ఉత్సాహం వ‌చ్చింది. ఎవ‌రికి వారు త‌మ త‌మ మార్గాల్లో లాబీయింగ్ స్టార్ట్ చేసేశారు.

ఇక పార్టీ సీనియ‌ర్లు కూడా జూనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తున్నార‌ని.. ఇప్పుడు కూడా వారికే మంత్రి ప‌ద‌వులు ఇస్తే.. వారికింద తాము ప‌ని చేయాలా ? అని ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌. ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్లో ఉన్న వారిలో చాలా మంది జూనియ‌ర్లు.... ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన వారు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కొత్త కేబినెట్‌నే ఎన్నిక‌ల కేబినెట్‌గా తీసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్ సీరియ‌స్‌గానే క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

అలా అని చెప్పి ఇప్పుడు కొత్త కేబినెట్లో వాయిస్ లేని వారు, పార్టీకి , ప్ర‌భుత్వానికి ఉప‌యోగ‌ప‌డ‌ని వారు ఉంటే ఎన్నిక‌ల‌కు ముందు పార్టీకి ఎదురు దెబ్బే అవుతుంది. ఈ రెండేళ్ల‌లో ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉంటాయి. వాటిని తిప్పికొట్ట‌లేని వారు జ‌గ‌న్ జ‌ట్టులో ఉంటే అది జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అవుతుంది. అందుకే సీనియ‌ర్ల‌తో పాటు అనుభ‌వం ఉన్న‌వారు, వాయిస్ ఉన్న వారితో స‌మ‌తూకం పాటిస్తూ కేబినెట్‌ను కూర్చాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

అందుకే ప్ర‌స్తుతం కేబినెట్లో ఉన్న వారిలో న‌లుగురు మంత్రుల‌ను మ‌రోసారి కంటిన్యూ చేస్తూ.. మిగిలిన వారిని అంద‌రిని మార్చేస్తార‌ని తాడేప‌ల్లిలో టాక్ వినిపిస్తోంది. విజ‌య‌న‌గ‌రం నుంచి సీనియ‌ర్ నేత బొత్స స‌త్యానారాయ‌ణ‌, చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, ప్ర‌కాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంటిన్యూ అవుతార‌ని అంటున్నారు.

ఈ న్యూస్ గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటె క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో షేర్ చేసి కామెంట్ రూపం లో మాతో పంచుకోండి.