కరెక్ట్ టైమ్ లో జగన్ కి బాసటగా... ?

Sat Oct 23 2021 18:00:01 GMT+0530 (IST)

Jagan received overwhelming support at the right time

ఏపీ సీఎం జగన్ ఎపుడూ తాను ఒంటరి నే అంటారు. ఆయన రాజకీయం కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికి సగం పాలన పూర్తి చేసిన జగన్ జాతీయ స్థాయిలో ఏ నేతలతోనూ పెద్దగా సాన్నిహిత్యం అయితే నెరిపినట్లుగా అధారాలు లేవు. అదే టైమ్ లో పొరుగున ఉన్న తెలంగాణాతోనూ ఆయన తగినంత మోతాదులో మాత్రమే సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే ఆ మధ్య క్రిష్ణా నదీ వివాదాల పుణ్యమాని అటు వైసీపీ ఇటు టీయారెస్ ల మధ్య సంబంధాలు గట్టిగా దెబ్బతిన్నాయని ప్రచారం అయితే బాగానే సాగింది. జగన్ సైతం హైదరాబాద్ కి కూడా ఈ మధ్యన అసలు పోవడంలేదు. నిజానికి ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి అసలు కదలి బయటకు రావడం కూడా లేదు.ఈ నేపధ్యంలో తెలంగాణా నుంచి అందునా టీయారెస్ నుంచి జగన్ కి కరెక్ట్ టైమ్ లో అనూహ్యమైన మద్దతు లభించింది. భావి ముఖ్యమంత్రి టీయారెస్ యువ రాజు అని భావించే కేటీయార్ జగన్ మీద టీడీపీ నేత పట్టాభి చేసిన బూతు పురాణాన్ని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద బూతులు మాట్లాడుతారా అంటూ ఆయన ఆశ్చర్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి విధానం కాదని కూదా ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొనసాగే వారికి హుందాతనం అవసరం అని కూడా ఆయన హితవు పలికారు.

ఇక టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి కంటే కూడా దానికి దారి తీసిన మూలాలను చూడాలని కేటీయార్ అనడం అంటే అది కచ్చితంగా జగన్ కి వైసీపీకి ఫుల్ సపోర్ట్ గా చేసిన కామెంట్స్ అనే అంటున్నారు. అంటే ముందుగా రెచ్చగొట్టింది టీడీపీయే అన్నది కూడా దీని భాష్యంగా చెప్పుకోవచ్చు అంటున్నారు. ఇక రాజకీయాల్లో ఓడిన వారు గెలుపు కోసం జనాల వద్దకు పోవాలని వారిని మంచి చేసుకుని అధికారం సంపాదించాలని ఆయన చెప్పిన మాట కూడా టీడీపీకి తలంటు గానే చూడాలని అంటున్నారు. రాజకీయ అసహనం అన్న మాటను కూడా ఇక్కడ కేటీయార్ వాడారు

ఇప్పటికిపుడు అధికారంలోకి రావాలన్న తొందర ఎందుకు అని ఆయన ప్రశ్నించడం ద్వారా అటు ఏపీలోని టీడీపీనే కాదు తెలంగాణాలోని విపక్షాలకు కూడా గట్టి ఝలక్ ఇచ్చారనే అనుకోవాలి. మొత్తానికి కేటీయార్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. ఏపీలో ఏదో జరిగిపోతోంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ టీడీపీ చొక్కాలు చింపుకుంటున్న వేళ జాతీయ స్థాయిలో వైసీపీని బదనాం చేయాలని చూస్తున్న సందర్భంలో కేటీయార్ చేసిన ఈ కామెంట్స్ వారిని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు ఏపీలో తాజా పరిణామాల పట్ల జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మూడ్ ఏంటి అన్నది కూడా తేటతెల్లం చేశాయని కూడా అంటున్నారు.