Begin typing your search above and press return to search.

కేంద్రం - రాష్ట్రం మధ్య విద్యుత్ చిచ్చు?

By:  Tupaki Desk   |   16 Oct 2019 8:00 AM GMT
కేంద్రం - రాష్ట్రం మధ్య విద్యుత్ చిచ్చు?
X
సౌర - పవన్ విద్యుత్ కంపెనీలకు లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్ ఎల్సీ)లు ఇచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం తన అభ్యంతరాలు కొనసాగిస్తూ ఉంది. ఈ విషయంపై కేంద్రం నుంచి ఒత్తిడి వస్తూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. సౌర - పవన విద్యుత్ కొనుగోలు రాష్ట్రానికి భారం అవుతోందని ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల్లో అధిక ధరలు ఉండటంతో.. ఖజానాపై అపరిమితమైన భారం పడుతోందని జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. చంద్రబాబు హయాంలో ఆ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఎల్ ఎల్సీలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పడుతూ ఉంది. అందుకే కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది.

ఈ విషయంలో కేంద్రం నుంచి ఒత్తిడి మాత్రం కొనసాగుతూ ఉంది. కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయట. ఇది దేశమంతటికీ తెస్తున్న నియమం అని ఈ విషయంలో ఒక రాష్ట్రం కోర్టును ఆశ్రయిస్తే చాలా రాష్ట్రాలు బ్రేక్ వేస్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఈ విషయంలో పట్టువీడటం లేదని టాక్. ఇలా రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు విబేధించే పరిస్థితి వచ్చిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పవన - సౌర విద్యుత్ కంపెనీలకు ప్రతి వారం ప్రభుత్వం డబ్బులు చెల్లించుకోవాలి. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో జగన్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఒప్పందంపై స్టే తెచ్చుకుంది. ఇది కేంద్రానికి మింగుడు పడటం లేదని సమాచారం. అయితే ఇంకా సుప్రీం కోర్టుకు వెళ్లే వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రానికి సానుకూలంగా లేదు. అయితే ప్రస్తుతానికి తాము సౌర - పవన విద్యుత్ లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని - తాము ఎల్ ఎల్సీలు అవసరం లేదని తెలంగాణ రాష్ట్రం భావిస్తోంది. అయితే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే ఈ విబేధాలు కేవలం విధానపరమైనవిగా తీసుకుంటే పెద్ద సమస్యలు లేవు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తాము చెప్పినట్టుగా వినాల్సిందే అంటూ కేంద్రం ఇగో ని ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయా అనేది ప్రశ్నార్థకమే. అయితే జగన్ వ్యతిరేకులు మాత్రం ఈ విషయాన్ని పెద్దదిగా చేసి, కేంద్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉందని ప్రచారం చేసేందుకు తాపత్రయపడుతూ ఉండటం గమనార్హం.