జగన్ ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు అవును ఇది నిజమే. చాలా సందర్భాలలో అది రుజువు అయింది కూడా. ఆయన వృత్తిపరంగా బిజినెస్ మాన్. ఇక ఇంట్లో రాజకీయం ఉంది కాట్టి అది ఎంతో కొంత ఒంటబట్టింది. దానికి ఆయనలో ఉన్న పట్టుదల తోడు అయి ఈ రోజు రాజకీయాన అగ్ర భాగాన ఉన్నారు. ఆయన తండ్రికి సీఎం కల నెరవేర్చుకోవాలీ అంటే మూడున్నర దశాబ్దాల కాలం పడితే జగన్ కి కేవలం పదేళ్ళు మాత్రమే పట్టింది. దీని వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి ఇపుడు అప్రస్తుతం.
కానీ జగన్ ఏ రాజకీయ పాఠశాలలో పాఠాలు పెద్దగా నేర్చుకున్నది లేదు. ఆయన తనకు తానుగానే జనంలోకి వెళ్ళిపోయారు. అదే విధంగా రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఆయనకు చాలా పాఠాలు నేర్పారు. వాటితో రాటుదేలి ఆయన ఈ రోజు నాయకుడిగా ఉన్నత స్థానంలోకి వచ్చారు.
ఇవన్నీ పక్కన పెడితే జగన్ అత్యంత ఉన్నతమైన రాజకీయ స్థానంలో ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం ఆయన ఇంకా ట్రెడిషనల్ పాలిటిక్స్ ని అర్ధం చేసుకున్నట్లుగా కనిపించదు. ఎవరైనా పెద్దవారు మరణిస్తే వెళ్ళి పరామర్శించడం సంప్రదాయ రాజకీయం. జగన్ ఈ విషయంలో ఎందుకో కాస్తా భిన్నంగా కనిపిస్తారు. దానికి తాజా ఉదాహరణ. తెలుగు వారి పెద్దాయన కొణిజేటి రోశయ్య.
రోశయ్య నిండు జీవితాన్ని చూశారు వివాదరహితుడిగా మెలిగారు. ముఖ్యమంత్రిగా గవర్నర్ గా పనిచేశారు. అంతకు ముందు కూడా సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఏ రకంగా చూసినా వంక పెట్టలేని పెద్దమనిషి రోశయ్య. ఆయన పరమపదించారు అంటే ఊరూ నాడూ అంతా ఒక్కటై రోదించింది. ఉమ్మడి ఏపీని ఏలినందుకు అటు తెలంగాణాతో పాటు ఇటు ఏపీ సర్కార్ కూడా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
జగన్ సైతం రోశయ్య మృతికి ప్రగాడ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడితో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. తన మంత్రులను అంత్యక్రియలకు పంపించారు. అన్నీ బాగానే ఉన్నా ఆ పెద్దాయన భౌతిక కాయాన్ని జగన్ ఒకసారి సందర్శించి వస్తే బాగుండేది అన్న మాట అయితే వినిపిస్తోంది.
జగన్ అంటే వైఎస్సార్ కుమారుడిగా రోశయ్యకు ఎంతో ఇష్టం. అదే విధంగా జగన్ కి కూడా ఆయన అంటే గౌరవం. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే ఎందుకో మరి జగన్ స్వయంగా వెళ్లి నివాళి అర్పించలేకపోయారో తెలియదు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ రాజకీయేతర వర్గాలంతా కూడా ఆయనను కడసారి చూసి అంజలి ఘటిందారు. మరి జగన్ ఏ కారణాల వల్ల వెళ్లలేదు అన్నది ఎవరికీ తెలియదు కానీ వెళ్లి ఉంటే బాగుండేది అన్నదే అందరి మాట.