కామరాజ్ ప్రణాళికకు జగన్ ఓకే

Sun Jul 18 2021 15:19:26 GMT+0530 (IST)

Jagan is OK with the Kamaraj plan

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయా? అధికార వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు రాజ్యసభకు వెళ్లబోతున్నారా? కామరాజ్ ప్రణాళికలకు సీఎం జగన్ అమలు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను రాజ్యసభకు పంపబోతున్నారా అనే చర్చ వైఎస్ఆర్ సీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి యువకులకు దారి ఇవ్వాలని 1963లో నెహ్రూకు సూచించారు. ఇందిరా గాంధీ హయాంలోనూ సీనియర్ నేతలను రాజీనామా చేసేలా ప్రణాళికలు అమలు పరిచారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో సాగాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే బోత్స పెద్దిరెడ్డిలను రాజ్యసభకు పంపించడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నేతల వ్యవహారం జగన్‌కు తలనొప్పిగా మారిందనే విశ్యసనీయ వర్గాలు అనుకుంటున్నాయి. తనదైన దూకుడుతో పాలన చేస్తున్న జగన్‌కు ఈ సీనియర్ నేతలు తమ సొంత జిల్లాల్లో పూర్తి పట్టు సాధించి తనకు అడ్డువస్తున్నారనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో యువ నాయకులు ఎదిగేలా ప్రోత్సహించే అవకాశం ఉండట్లేదనే జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాను తీసుకుంటే సీనియర్ నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి ఆధిపత్యం ప్రదర్శస్తున్నారనే టాక్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్కే రోజా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి లాంటి యువ నాయకులు ఎదిగేందుకు అవకాశం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ మరో రెడ్డి నేత మంత్రి అయ్యే అవకాశం లేదు. దీంతో రోజా చెవిరెడ్డికి దారులు మూసుకుపోయినట్లేననే వార్తలు వస్తున్నాయి.

అలాగే విజయనగరంలోని బొత్స వ్యవహారం కూడా ఉంది. దీంతో ఈ జిల్లాల్లో వీళ్లను కాదని నిర్ణయాలు తీసుకోవడం జగన్‌కు తలభారంగా మారింది. దీంతో వీళ్లను రాజ్యసభకు పంపించి యువ నాయకులకు అవకాశాలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. మరి దీనిపై ఆ సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.