Begin typing your search above and press return to search.

నర్సాపురం బరిలో జగన్... ?

By:  Tupaki Desk   |   16 Jan 2022 7:37 AM GMT
నర్సాపురం బరిలో జగన్... ?
X
నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక మీద చర్చ ఇపుడు హీటెక్కుతోంది. తాను నర్సాపురం సీటుకు రాజీనామా చేసి ఆ వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని రాఘురామ క్రిష్ణం రాజు అంటున్నారు. అంతే కాదు, ఆయన వైసీపీ సర్కార్ మీద నిప్పులే చెరుగుతున్నారు. జగన్ ని వట్టి పిరికివాడు అని కూడా నిందిస్తున్నారు.

తాను ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్నాను అన్న కారణం చేత తనను హత్య చేయాలని కూడా చూస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. అయినా తాను తగ్గేది లేదని ఆయన అంటున్నారు. ఇక నర్సాపురంలో వైసీపీకి తన మీద పోటీ పెట్టేందుకు వైసీపీకి సరైన క్యాండిడేట్ దొరకడంలేదని ఎద్దేవా చేశారు.

తాను ఏ పార్టీ తరఫున అయినా పోటీ చేస్తానేమో అని కంగారు పడి ఆయా పార్టీల నేతల‌తో మాట్లాడుతూ తనకు టికెట్ ఇవ్వవద్దని కూడా వైసీపీ పెద్దలు వేడుకుంటున్నారు అని రఘురామ మరో ఆరోపణ చేశారు. ఇక నర్సాపురంలో తన మీద పోటీ చేయడానికి మెగాస్టార్ చిరంజీవిని దింపడానికి జగన్ చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో చిరంజీవితో మాట్లాడాలని జగన్ ఓ వ్యాపారవేత్తను కోరినట్లు ఎంపీ తెలిపారు. అదే సమయంలో చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించినట్లు నాకు సమాచారం ఉందని రాజు గారు చెప్పారు.

ఇక తనకు ఎలాంటి రాజ్యసభ సీటు ఆఫర్ జగన్ నుంచి రాలేదని చిరంజీవి చెప్పిన మాటలను తాను నమ్ముతానని, ఒకవేళ ఇచ్చినా అంగీకరించేందుకు చిరంజీవి నిరాకరిస్తారని కూడా రఘురామ అంటున్నారు. పవన్‌తో పాటు మరో ఇద్దరు సినీ ప్రముఖులపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా సినీ పరిశ్రమను నాశనం చేయాలని వైసీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఘాటు కామెంట్స్ రాఘురామరాజు చేయడం విశేషం.

పవన్ ని కక్ష సాధించాలని చూస్తే ఆయన ఎక్కడా తగ్గరని, తన సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసుకుంటారు తప్ప వెనక్కి రానే రారు అని రఘురామ అంటున్నారు. పవన్ విలువలు కలిగిన నాయకుడు అని రాజు గారు కొనియాడారు.

ఇదిలా ఉంటే నర్సాపురం లో అభ్యర్ధులు ఎవరూ లేని వైసీపీకి ఆయన ఒక సలహా ఇచ్చారు. ఈసారి పోటీకి ఎవరో ఎందుకు జగనే రావచ్చు కదా అని సవాల్ చేశారు. మొత్తానికి ఒకే సమయంలో పలు తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా రఘురామరాజు వైసీపీ పెద్దలను బాగా టార్గెట్ చేశారు. మరి దీనికి అటు వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.