ఆ పత్రిక కొనుగోలుకు వలంటీర్లకు రూ.48 కోట్లు ఇస్తున్న జగన్ ప్రభుత్వం!?

Sun Jul 03 2022 19:00:01 GMT+0530 (IST)

Jagan government is giving Rs 48 crores to the volunteers for the purchase of that newspaper

ఇప్పటికే ప్రజాధనాన్ని వైఎస్సార్సీపీ నేతలకు సలహాదారుల రూపంలో దోచిపెడుతోందనే విమర్శలు జగన్ ప్రభుత్వంపై ఉన్నాయి. దాదాపు 70 నుంచి 80 మందిని ప్రభుత్వ సలహాదారులుగా సీఎం సలహాదారులుగా నియమించుకుని.. వారికి నెలకు లక్షల రూపాయలు దోచిపెడుతోందనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తనకు చెందిన సాక్షి దినపత్రికకు కోట్ల రూపాయలను యాడ్స్ రూపంలో అప్పనంగా అప్పగిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే మరోసారి జగన్ ప్రభుత్వం తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుందని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. తెలుగులో ఆంధ్రప్రదేశ్ లో మంచి సర్క్యులేషన్ ఉన్న ఒక పత్రికను కొని చదవడానికంటూ ప్రతి వలంటీర్ కు నెలకు రూ.200 అందిస్తోందని ప్రధాన మీడియా తెలిపింది. ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవడానికి వీటిపై ప్రతిపక్షాలు ఏదైనా మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వలంటీర్లంతా ఆ పత్రికనే కొని చదవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొన్నట్టు ఒక ప్రముఖ పత్రిక సంచలన కథనం ప్రచురించింది.

మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 2.66 లక్షల మంది వలంటీర్లు ఉండగా ప్రతి వలంటీర్ ఆ పేపర్ కొనుక్కుని చదవడానికి ఒక్కో వలంటీర్ కు నెలకు రూ.200 ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు జూన్ 29నే ప్రభుత్వం జీవో ఇవ్వగా తాజాగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. వలంటీర్లు దినపత్రిక కొనుక్కునేందుకు నెలకు రూ.250 చొప్పున అదనంగా చెల్లించాలని గ్రామ/ వార్డు వలంటీర్లు సచివాలయాల విభాగం డైరెక్టర్ ప్రతిపాదించారని.. అయితే ప్రభుత్వం నెలకు రూ.200 చొప్పున ఇవ్వాలని నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని సమాచారం. 2022 జులై నుంచి 2023 మార్చి వరకు వలంటీర్లకు పేపర్ కొనుగోలుకు డబ్బులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.66 లక్షల మంది వలంటీర్లున్నారు. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నెలకు రూ.5.32 కోట్లు 9 నెలలకు రూ.47.88 కోట్లు ఇవ్వనుందని అంటున్నారు. మార్చి తర్వాత ఈ సదుపాయాన్ని మరింత కాలం పొడిగిస్తూ జీవో ఇస్తారని చెబుతున్నారు.

ప్రభుత్వ పథకాలు సేవలపై ఏదైనా మీడియా గానీ వ్యక్తులు గానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆ విషయాన్ని ప్రజలకు వివరించేందుకు వారికి దినపత్రిక కొనేందుకు డబ్బులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపిందని ప్రముఖ పత్రిక కథకం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక కొనుగోలు కోసమే వలంటీర్లకు ఈ నగదు ఇస్తుందని విమర్శిస్తున్నారు. జగన్ తన సొంత పత్రిక సాక్షికి ఇప్పటికే యాడ్స్ రూపంలో ఈ మూడేళ్లలో వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారని తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. మళ్లీ ఇప్పుడు సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకే ఈ ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడుతున్నారు.