Begin typing your search above and press return to search.

కుప్పంలోనే జగన్ సర్కార్ ఫెయిల్...?

By:  Tupaki Desk   |   5 Aug 2022 10:32 AM GMT
కుప్పంలోనే జగన్ సర్కార్ ఫెయిల్...?
X
కుప్పం. ఈ పేరు ఇపుడు ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెస్తున్న ఘనత కచ్చితంగా వైసీపీదే. చంద్రబాబు ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచినా పెద్దగా రాజకీయాల్లో వినిపించే పేరు కాదు ఇది. ఇక చంద్రబాబు గెలుపు ఎపుడూ నల్లేరు మీద నడకలా సాగిపోతూ వచ్చింది. మరో వైపు చూస్తే కుప్పంలో ధీటైన అపోజిషన్ కూడా లేకపోవడం వల్ల బాబుకూ టీడీపీకి కలసివచ్చింది. అయితే ఇపుడు బాగానే పొలిటికల్ సీన్ మారింది.

కుప్పాన్ని సొంతం చేసుకోవాలని వైసీపీ గట్టిగా చూస్తోంది. సీఎం గా నాలుగవసారి ప్రమాణం చేయాలనుకుంటున్న చంద్రబాబుని ఎనిమిదవసారి కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలన్నది జగన్ మాస్టర్ ప్లాన్. అందుకోసం ఆయన చేయాల్సిన పనులు అన్నీ చేస్తున్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో కుప్పాన్ని ఈసారి సొంతం చేసుకోవాలని జగన్ పట్టుదల పట్టారు.

ఇదిలా ఉంటే కుప్పం మీద జగన్ పెట్టిన మీటింగులో అక్కడ ఉన్న అతి కీలకమైన సమస్యను నియోజకవరం ఇంచార్జి, ఎమ్మెల్సీ అయిన భరత్ జగన్ కి చెప్పారు. అదేమిటి అంటే కుప్పం ప్రజల దాహార్తిని తీర్చే హంద్రీ నీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తే కుప్పానికి నీటి సమస్య తీరిపోతుంది. ఇదే విషయాన్ని భరత్ జగన్ కి చెప్పడం, ఆయన కూడా సరేనని హామీ ఇవ్వడం జరిగిపోయాయి.

కానీ ఇక్కడే అసలైన పాయింట్ ని అంతా పట్టుకుంటున్నారు. కుప్పం విషయంలో ఇంతకాలం ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది అని. అక్కడ విపక్ష ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉండడం చేతనేనా పొలిటికల్ గా ఆలోచన చేసి పట్టించుకోలేదా అన్న డౌట్లు వస్తున్నాయి. అదే విధంగా కుప్పం విషయంలో వైసీపీ ప్రతిష్టగా తీసుకున్నపుడు అక్కడ ఉన్న సమస్యలు ఏమిటి అన్నవి ప్రభుత్వానికి తెలియాలి కదా.

కుప్పాన్ని గెలిచేయాలని అనుకున్నపుడు నీటి సమస్య చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు గుర్తించలేకపోయారు అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. మరో వైపు చూస్తే కుప్పం విషయంలో ఇరిగేషన్ కాంట్రాక్ట్ ని నాటి సీఎం చంద్రబాబు తనకు ఇష్టుడైన సీఎ రమేష్ కి అప్పగించారు. ఆయన ఇపుడు బీజేపీలో ఉన్నారు. మరి బాబు మారి మూడేళ్లు అయింది. జగన్ వచ్చిన తరువాత చాలా ప్రాజెక్టులకు పాత కాంట్రాక్టులను మార్చేశారు.

కానీ సీఎం రమేష్ ని ఎందుకు మార్చలేదు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. జగన్ సొంత జిల్లాకు చెందిన రమేష్ అంటే ఏదైనా ప్రత్యేక అభిమానాలు ఉన్నాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. కుప్పం విషయంలో హంద్రీ నీవా పనులు పూర్తి చేయడం చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి మూడేళ్ళ తరువాత తెలిసింది అంటే ఈ మేరకు వైసీపీ సర్కార్ ఫెయిల్ అయినట్లే అంటున్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మీద గెలిచేసి ఎమ్మెల్యే కావాలనుకుంటున్న భరత్ కి ఇంతటి ప్రాధాన్యత కలిగిన సమస్య తెలియకపోవడం ఏంటి అని కూడా అంటున్నారు. ఇక కుప్పాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు అయినా జగన్ దృష్టికి ఈ సమస్య తేలేకపోయారా అని కూడా అంటున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద జగన్ సీఎం అయ్యాక ఇప్పటికి కొన్ని పదుల సార్లు సమీక్ష చేసి ఉంటారు. మరి అధికారులు ఈ ప్రాజెక్ట్ విషయం ఆయనకు చెప్పలేదా లేదా పక్కన పెట్టేశారా అని కూడా సందేహాలు వస్తున్నాయి.

మొత్తానికి చూస్తే కుప్పం విషయంలో అధికార పార్టీ ఫెయిల్ అయిందనే అంటున్నారు. మరి కుప్పంతో మొదలెడితేనే ఇలా జరిగింది. ముందు ముందు 175 నియోజకవర్గాలలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని కీలక సమస్యలు విస్మరించి ప్రభుత్వం పాలన సాగిస్తోందో కూడా రానున్న రోజులలోనే అంతా చూస్తారు అంటున్నారు.