Begin typing your search above and press return to search.

బాబు సంగతి సరే... వైఎస్సార్ కూడానా జగనూ?

By:  Tupaki Desk   |   18 Aug 2022 12:30 AM GMT
బాబు సంగతి  సరే... వైఎస్సార్ కూడానా జగనూ?
X
రాజకీయాల్లో క్రెడిట్ కోసం నేతాశ్రీలు ఎంత దూరం అయినా వెళ్ళిపోతారు. మన దేశంలో ప్రభుత్వాల కాల పరిమితి అయిదేళ్ళు. అయితే మొదటి నుంచి మన పాలనా విధానాల పుణ్యమాని ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటే అది మెదడులో మెదిలిన దగ్గర నుంచి అమలుకు నోచుకుని జనాల వద్దకు ఫలాలు చేరేసరికి ఎన్నో పుష్కరాలు దాటేస్తాయి. అలా ఒక పాలకుడు తలిస్తే మరో పాలకుడి అమలు రెండూ కలిస్తే తరువాత వచ్చిన వారు వాటిని ఎంచక్కా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది

ఇది చరిత్ర. ఇది ఒక సైకిల్ కూడా. అలా తిరుగుతూ ఉంటుంది. విషయం ఏంటి అంటే ఏ సీఎం ఉన్నా తానే అంతా చేశాను అని చెప్పుకోవడం. ఏపీలో ఇపుడు సరికొత్తగా క్రెడిట్ వార్ కూడా సాగుతోంది. చంద్రబాబు పద్నాలుగేళ్ల పాటు పనిచేసిన సీఎం. ఆయన ముద్ర ఏపీ మీద చాలానే ఉంటుంది. ఇక అంతకు ముందు వైఎస్సార్ లాంటి వారు కూడా ఏపీని పాలించారు. ఇక ఎంతో మంది దూరదృష్టి కలిగిన సీఎంలు కూడా ఏపీని ఏలారు. అందరి కృషి ఫలితమే ఏపీ ప్రగతి.

ఇది వాస్తవం అయితే మూడేళ్ళ సీఎం జగన్ అంతా నావల్లే ఏపీ టోటల్ ప్రగతి అని అనడమే ఇపుడు చర్చగా ఉంది. ఏపీలో ఏ ఒక్క కార్యక్రమం అయినా తన చలువే ఇదంతా అని జగన్ గట్టిగానే డబ్బాలు కొట్టుకుంటున్నారా అని సొంత పార్టీ వారే విస్మయపడే పరిస్థితి. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేస్తున్న కామెంట్స్ ఆ విధంగానే ఉన్నాయి. ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి అంతా మూడేళ్ళలోనే సాగిందని చెప్పడం విశేషం. తానే అంతా అయి ఏపీని నడిపిస్తున్నాను అని ఆయన చెప్పేసుకున్నారు.

ఇక ఆ తరువాత చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురంలో జరిగిన ఒక ప్రారంభోత్సవంలో కూడా జగన్ చేసిన కామెంట్స్ మీద చర్చ సగుతోంది. ఏపీలో పారిశ్రామిక ప్రగతి తమ ప్రభుత్వ ఘనత అని ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఏపీలో సంక్షేమం అయినా అభివృద్ధి అయినా పారిశ్రామిక ప్రగతి అయినా ఒక్క రోజులో రాలేదు, ఒక్కరితో ఆగలేదు, ఏ ఒక్కరి సొత్తుగానో అవి సాగలేదు. ఇది పరమ సత్యం.

కానీ జగన్ మాత్రం తానే అన్నింటికీ ఆది పురుషుడిని అని చెప్పుకోవడమే అందరినీ విస్తుబోయేలా చేస్తోంది. ఏపీలో పారిశ్రామిక ప్రగతికి నాటి కాంగ్రెస్ సీఎంలు ఎంతో కృషి చేశారు. అలా చూసుకుంటే కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, వైఎస్సార్, చంద్రబాబు వంటి వారి పేర్లను వరసగా చెప్పుకోవాలి. సంక్షేమం విషయం తీసుకుంటే ఎన్టీయార్ ని ఆధ్యుడిగా ఏపీ వరకూ చెప్పుకోవాలి ఆ తరువాత మరిన్ని అడుగులు వేసిన ఘనత వైఎస్సార్ ది.

ఇక ఏపీకి ఎందరో పారిశ్రామిక వేత్తలు వచ్చారు. వారిని నాటి సీఎంలు తెచ్చారు. అలాగే అమెరికా ప్రెసిడెంట్లను కూడా ఏపీకి తెచ్చిన ఘనత మాజీ సీఎంలు చంద్రబాబు, వైఎస్సార్ లకు దక్కుతుంది. అలాగే ఏపీలో సెజ్ లను పరిచయం చేసిన ఘనత కచ్చితంగా వైఎస్సార్ ది. ఇవన్నీ నిజాలు. కంటికి కనిపించే వాస్తవాలు. మరి వీటిని మరచి అంతా నావల్లే అనడం ద్వారా జగన్ పూర్వ ముఖ్యమంత్రులను వారి ప్రగతిని తక్కువ చేస్తున్నారా అన్న చర్చ రావడం సహజం.

ఇక ఏపీలో చూస్తే జగన్ కి చంద్రబాబుతో రాజకీయ వైరం ఉంది. దాంతో బాబుకు ఏ క్రెడిట్ రాకుండా చూడాలన్న ఆయన ఆరాటంలో తన తండ్రి ఉమ్మడి ఏపీకి అయిదుంపావు ఏళ్ళు సీఎం గా పనిచేసిన వైఎస్సార్ ని కూడా అవమానిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. దీన్ని వైఎస్సార్ అభిమానులుగా ఉన్న సొంత పార్టీ వారే జీణించుకోలేని స్థితి అని అంతా అంటున్నారు. జగన్ తన వ్యాఖ్యల విషయంలో దూకుడు కాస్తా తగ్గించుకుంటేనే మేలు అని కూడా అంటున్నారు.

ఒక రాష్ట్రం ప్రగతి నిరంతరంగా సాగుతుంది. అది ఏ ఒక్కరి సొత్తో కాదు. అయితే కొన్ని ఆలోచనలకు కొందరు సృష్టి కర్తలు ఉంటారు. ఆయా విషయాలను వారు గట్టిగా చెప్పుకోవచ్చు. అంతే తప్ప తాను ఉంటేనే రాష్ట్రం, లేకపోతే రావణ కాష్టం అంటే అది చివరికి ప్రజ‌లను కూడా అవమానించినట్లుగా ఉంటుంది. క్రెడిట్ కోసం పడే ఆరాటంలో చేసే ఇలాంటి కామెంటే చివరికి బూమరాంగ్ అవుతాయని కూడా అంటున్నారు. మరి జగన్ ఈ విషయం ఆలోచిస్తున్నారా లేదా అన్నదే చర్చ మరి.