పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం నజరానా

Tue Aug 03 2021 22:00:01 GMT+0530 (IST)

Jagan bumper offer to Pv Sindhu

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు బిడ్డ పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. 2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం సింధుకు రూ.30 లక్షల నజరానా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని.. సింధు విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. క్రీడల్లో సత్తా చాటే క్రీడాకారులందరికీ ప్రభుత్వం తరుఫున తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.2014 నుంచి ఇప్పవిరకు జాతీయ సీనియర్ సబ్ జూనియర్ స్థాయిల్లో పతకాలు సాధించిన రాస్ట్ర క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహక బహమతి అందజేసిందని సీఎం జగన్ తెలిపారు. అంతర్జాతీయ జాతీయ స్థాయి క్రీడాల్లో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులకు ఎవరికైనా ప్రభుత్వం తరుఫున ఇంకా ప్రోత్సాహకం అందకపోతే వారిని గుర్తించి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం నగదు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.

2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.75 లక్షలు రజత పతకం సాధించిన వారికి రూ.50లక్షలు కాంస్య పతకం సాధించిన వారికి రూ.30లక్షలు నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.

టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే ముందు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు సాత్విక్ హాకీ క్రీడాకారిణి రజినీలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున నగదు సహాయం అందించింది.

ఇక ఇటీవలే పీవీ సింధుకు విశాఖపట్నంలో రెండు ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. బాడ్మింటన్ అకాడమీ నిర్వహణ కోసం ఈ స్తలం కేటాయించారు. ఇక గతంలో రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు వెండి పతకం సాధించిన సందర్భంలో ఆమెకు భారీగా నగదు ప్రోత్సాహకం అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఏకంగా రూ.5 కోట్ల నగదుతోపాటు హైదరాబాద్ లో కోట్ల రూపాయల 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. ఏపీ ప్రభుత్వం కూడా రూ.3 కోట్ల నగదుతోపాటు అమరావతిలో 1000 గజాల స్థలం గ్రూప్ 1 ఉద్యోగం కూడా ప్రకటించింది.