Begin typing your search above and press return to search.

జగన్ ఆస్తుల కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి డబుల్ షాక్.. రెండు కోర్టుల్లో..

By:  Tupaki Desk   |   24 Sep 2021 4:54 AM GMT
జగన్ ఆస్తుల కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి డబుల్ షాక్.. రెండు కోర్టుల్లో..
X
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు ఈ మేరకు శ్రీలక్ష్మీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ నిందితురాలిగా ఉన్నారు. అయితే విచారణకు శ్రీలక్ష్మీ, ఆమె తరుఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.

జగన్ అక్రమాస్తుల కేసులో స్వయంగా కోర్టుకు రావాలంటూ శ్రీలక్ష్మికి కోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది.గురువారం జరిగిన విచారణకు శ్రీలక్ష్మీ, ఆమె తరుపు న్యాయవాదులు కోర్టుకు రాలేదు. పోనీ దీనికి సంబంధించిన అభ్యర్థనను కోర్టుకు సమర్పించలేదు. దీంతో సీబీఐ కోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. వారెంట్ ను ఈనెల 30లోగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ హైకోర్టులో వేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ ముందుకెళ్లాలని సీబీఐ కోర్టుకు సూచించింది.

మరోవైపు జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటీషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. పెన్నా కేసులో విశ్రాంత ఐఏఎస్ జి.వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఎన్.బీ.డబ్ల్యూ ను న్యాయస్థానం రీకాల్ చేసింది. వాన్ పిక్ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి ఈరోజు విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరికి గతంలో హైకోర్టు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు కానీ.. వారి తరుఫు న్యాయవాదులు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు గైర్హాజరైతే తగిన ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది.