లుక్ మారినా.. క్రీం కలర్ ఫ్యాంట్ వదలని జగన్

Mon May 23 2022 08:57:14 GMT+0530 (IST)

Jagan and his Dressing Style

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నంతనే ఎలా ఉండాలంటే.. ఎవరికి వారికి ఒక ప్రత్యేకమైన లుక్ ఉండటం మామూలే. పెద్ద వయసులో ముఖ్యమంత్రి అయిన నేతల తీరుతో పోలిస్తే.. యువ నేతల తీరు కాస్త భిన్నమనే చెప్పాలి.ఎక్కడిదాకానో ఎందుకు.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డినే తీసుకుంటే.. ఆయన్ను గుర్తుకు తెచ్చుకున్నంతనే మదిలో.. అసలుసిసలు తెలుగింటి పెద్ద మనిషిలా ఆయన ఆహార్యం ఉంటుంది. మల్లెపువ్వులాంటి పంచె కట్టుతో.. తెల్లటి లాల్చితో ఆయన్ను చూసినంతనే కనెక్టు అయిపోతారు.

అలాంటి వైఎస్ విదేశా పర్యటనల సందర్భంగా మాత్రం సూటు.. బూటు వేసుకునేవారు. ఆ డ్రెస్సులోనూ ఆయన ఇట్టే ఇమిడిపోవటంతో పాటు.. పరిస్థితులకు తగ్గట్లుగా తననుతాను మార్చుకోవటంతో పాటు..  ఒదిగిపోవటం కనిపిస్తుంది. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నం.

చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఆయన.. క్రీం కలర్ ఫ్యాంటు.. లైట్ బ్లూ కలర్ షర్టు.. లేదంటే లైట్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్టులతో కనిపిస్తారు. పేరుకు ఫుల్ హ్యాండ్ షర్టు అయినప్పటికి.. చేతల్ని కాస్తంత పైకి మడిచి పెట్టటం.. చేతికి సాదాసీదాగా కనిపించే చెప్పులు వేసుకోవటం (కాకుంటే బ్రాండెడ్ వే వాడతారు. చూసినంతనే అనుకునే ధరతో పోలిస్తే ఖరీదైనవే ఉండటం ఆయన ప్రత్యేకత) కనిపిస్తుంది.

ఇలాంటి జగన్.. తాజాగా వెళ్లిన దావోస్ లో మాత్రం ఆయన తీరు రోటీన్ కు భిన్నంగా ఉంది. సూట్ వేసుకున్న ఆయన.. కాళ్లకు షూస్ వేసుకోవటం ఓకే అయినా.. ఫార్మల్ గా లేకుండా.. తనదైన శైలిలో కొన్ని అలవాట్లను యథాతధంగా ఉంచేయటం గమనార్హం.

తాను ఎప్పుడూ ధరించే క్రీం కలర్ ఫ్యాంట్ ను.. తాజా సూట్ మీదా వేసుకోవటం.. సూట్ వేసుకు్నప్పటికి మిగిలిన వారి మాదిరి.. టై ధరించకుండా.. చొక్కా పై గుండీని వదిలేసి.. తనదైన స్టైల్ లో ఉండటం కనిపిస్తుంది. కాకుంటే.. రోటీన్ తో పోలిస్తే మాత్రం ఆయన.. కాస్త భిన్నమైన లుక్ కనిపించారనే చెప్పాలి. అన్ని బాగున్నాయి కానీ.. క్రీం కలర్ ఫ్యాంట్ ను వదిలేసి ఉంటే.. మరింత స్టైల్ గా ఉండేవారన్న మాట వినిపిస్తోంది.