నిన్న మోడీ - నేడు వైఎస్ జగన్..మంత్రులపై!

Wed Jul 17 2019 20:00:01 GMT+0530 (IST)

లోక్ సభలో ఏ అంశం మీదా తన మంత్రులు సరిగా చర్చలో పాల్గొనడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అసహనం వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే ఇదే అంశం ఏపీలో కూడా చర్చకు రావడం గమనార్హం. లోక్ సభకు సరిగా హాజరే కావడం లేదట కొంతమంది కేంద్రమంత్రులు. కొందరు సహాయ మంత్రులతో సమాధానాలు చెప్పిస్తూ తాము సభకు రావడం మానేశారట.అలాంటి వారి జాబితాను రెడీ చేయాలని సభలో జరిగిన చర్చను ఆధారంగా మంత్రుల పనితీరు పై తనకు నివేదిక ఇవ్వాలని మోడీ కోరినట్టుగా తెలుస్తోంది.

విశేషం ఏమిటంటే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా అదే అనుభవం తప్పడం లేదట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంత్రులు స్పందిస్తున్న తీరు మీద ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారని సమాచారం.

మరింత విశేషం ఏమిటంటే.. సభలో అనుసరించాల్సిన తీరు గురించి ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేయగా.. దానికి చాలా మంది హాజరే కాలేదట! సభలో తెలుగుదేశం పార్టీ చర్చను తప్పుదోవ పట్టిస్తూ ఉందని బడ్జెట్ మీద జరగాల్సిన చర్చను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని జగన్ భావిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో చర్చ సవ్యంగా సాగేందుకు ఎలా వ్యవహరించాలనే అంశం మీద జగన్ మంత్రులతో కలిసి కసరత్తు చేయాలని భావించారు. అయితే ఆ  సమావేశానికి మంత్రులు హాజరు కాలేదు. దీంతో.. వారి పేర్లను తనకు ఇవ్వాలని చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డిని కోరారట ముఖ్యమంత్రి!

మొత్తానికి మోడీకి - జగన్ కు ఇద్దరికీ తన మంత్రుల నుంచి పూర్తి సహకారం అయితే అందుతున్న దాఖలాలు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.