కూల్ గా జగన్ - కస్సుమంటున్న చంద్రబాబు!

Fri Apr 12 2019 22:05:13 GMT+0530 (IST)

Jagan and Chandrababu Naidu Shows Confidence to Win in Andhra Elections 2019

పోలింగ్ ముగిసిన తర్వాత నేతల ఎక్స్ ప్రెషన్లను కూడా జనాలు గమనిస్తూ ఉన్నారు. నేతలకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఎక్కడ తమకు అనుకూలంగా ఉంది ఎక్కడ తమకు వ్యతిరేకంగా ఉంది.. అనే అంశాలపై నేతలకు పూర్తి స్పష్టత ఉంటుందని… అంతా అనుకుంటూ ఉన్నారు. రాజకీయ పార్టీల నేతలకు వారి పార్టీ నేతలు - కార్యకర్తల రూపంలో గట్టి నెట్ వర్క్ ఉంటుంది.బూత్ స్థాయిల నుంచి వాళ్లకు సమాచారం పక్కగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ తమకు అనుకూలంగా ఓట్లు పోల్ అయ్యాయి - ఎక్కడ తమకు వ్యతిరేకత ఉందనే విషయం వారికి ఈ పాటికే స్పష్టత వచ్చి ఉంటుందని జనం కూడా అనుకుంటున్నారు. ఫలితాల వరకూ ఆగక్కర్లేదు.. నేతలకు ఈ పాటికే తెలిసి పోయి ఉంటుంది.. అనేది కామన్ గా వినిపిస్తున్న అభిప్రాయం.

ఇలాంటి నేపథ్యంలో నేతల మొహాల్లోని ఎక్స్ ప్రెషన్లను వారి మాట తీరును బట్టి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది.  ఇలా చూస్తే… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాగా కూల్ గా కనిపిస్తూ ఉన్నారు. అదే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కదిలిస్తే చాలు కస్సుమంటున్నారు.

ముందుగా జగన్ మాట్లాడుతూ..తమ పార్టీ విజయం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. తమకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కబోతోందని జగన్ అన్నారు. అంతేగాక.. జగన్ ఎవరినీ నిందించలేదు. పోలింగ్ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు హింసను సృష్టించారని జగన్ అన్నారు.. నష్టపోయిన తమ వారికి సంఘీభావం ప్రకటించారు. అంతేకానీ.. ఈసీని కాని మరెవరినీ జగన్ నిందించలేదు. ఇన్ని రోజులూ జగన్  పోలీసుల మీద అయినా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే పోలింగ్ తర్వాత పోలిసుల మీద కూడా ఏ విమర్శలూ చేయలేదు.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే రెండో రోజు ఆయన యథారీతిన రెచ్చిపోయారు. ఒకవైపు తమ పార్టీకి నూటా ముప్పై సీట్లు వస్తాయని అంటూనే.. మరోవైపు 'అసలు ఇవి ఎన్నికలే కాదు.. ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలం అయ్యింది..' అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒకవైపు ఇవి ఎన్నికలే కాదంటూ.. మళ్లీ తన పార్టీ నూటా ముప్పై సీట్లు సాధిస్తుందని చంద్రబాబు నాయుడు అనడం.. ఆయనలోని అసహనాన్ని చాటుతూ ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తానికి పోలింగ్ అనంతరం జగన్ కూడా టండా.. టండా .. కూల్.. కూల్ అన్నట్టుగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఈ వేడిని మరింత వేడెక్కించేలా సెగలు కక్కారు! వీరి ఎక్స్ ప్రెషన్ల భావం ఏమిటో!