రాత్రి 10 వరకే మద్యం..జగన్ మరో ముందడుగు!

Tue Nov 19 2019 18:09:56 GMT+0530 (IST)

Jagan YSRCP govt Restrict Liquor Sales Closed before 10 PM

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గించి..మద్యం ధరలను పెంచి..ఎక్సైజ్ సిబ్బందితో విక్రయాలు సాగిస్తున్న ప్రభుత్వం ..ఇప్పుడు బార్ల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఎక్సైజ్ అధికారులకి మొదటగా  రాష్ట్రంలో బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలని సీఎం సూచించగా.. ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని - విడతల వారీగా తగ్గిద్దామన్న అధికారులు చెప్పారు.ఇక సుదీర్ఘ చర్చ అనంతరం బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బార్ల విధానం అమలులోకి రానుంది. బార్లు మొత్తం తీసేసి కొత్త బార్లను లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నారు. అలాగే  బార్లలో మద్యం సరఫరా సమయాన్ని సైతం తగ్గించేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే బార్లలో మద్యం సరఫరా చేయబోతున్నారు. ఇక స్టార్ హోటళ్లలో మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం సరఫరా ఉంటుంది.

ఇక ఇప్పటికే మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. బార్లలో అమ్మే మద్యం ధరలను కూడా పెంచే ఆలోచనలో ఉంది. అలాగే మద్యం కల్తీకు పాల్పడినా..స్మగ్లింగ్ చేసినా.. నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదుతో పాటుగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.మద్యం - ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలని సీఎం  అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.