జగన్ ఇలా కూడా చేయగలడా?

Tue Sep 22 2015 22:41:05 GMT+0530 (IST)

Jagan Speech At Yuva Bheri

వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రూటుమార్చారు. ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న జగన్ కొత్త పంథాలో తన లక్ష్యసాధన దిశగా సాగుతున్నారు. ఒకప్పుడు ఓదార్పు యాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్ ఇప్పుడు రాజకీయవేత్త కంటే...ప్రొఫెసర్ గా ఫిట్ అయిపోయారు.
 
యూనివర్శిటీల్లో మీటింగ్లు పెట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై విద్యార్థులకు కూలంకషంగా వివరించేందుకు జగన్ ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో మొదట శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సమావేశం పెట్టారు. ఎస్వీయూలో జరిగిన సభలో జగన్ వాగ్దాటిని ఆయన  సబ్జెక్టును చూసి రాజకీయవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు.అసలు.. మాట్లాడింది జగనేనా? అనే సందేహం కూడా రాజకీయవర్గాల్లో సాగింది. ఓ రేంజ్ సబ్జెక్ట్ తో  ప్రతిపక్షనేత జగన్మాట్లాడటం చూసి టీడీపీ వాళ్లు కూడా జగన్ లో ఇంత విషయం ఉందా అని ఆశ్చర్యపోతున్నారట. ఇదే క్రమంలో విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్ధులతో  సమావేశమయిన సమయంలోనూ జగన్ తన స్పీచ్ తో విద్యార్థులను ఆకట్టుకున్నారని చర్చసాగుతోంది.
 
ఎస్వీయూ ఆంధ్రా యూనివర్సిటీల సమావేశాల్లో ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలేంటి? రాకపోవడం వల్ల రాష్ట్రం ఎన్నివిధాల నష్టపోతుంది? అనే విషయాల్ని విద్యార్థులకు జగన్  వివరించారు. ఇప్పటికే వైసీపీ విద్యార్ధి విభాగానికి భవిష్యత్ ప్రణాళిక అందించిన జగన్ ఆయా వర్సిటీల విద్యార్ధుల సహకారంతో తన నిరాహారదీక్షను విజయవంతం చేయాలని చూస్తున్నారు.
 
విశాఖ సభకు పోలీసులు ఆంక్షలు విధించినా.. సభను నిర్వహించారు. విశాఖ సభ కూడా బాగా సక్సెస్ అయిందని పార్టీ వర్గాలు సంతోషిస్తున్నాయి. పోలీసు అధికారులు టీడీపీ ప్రభుత్వం ఆటంకాలు ఎన్ని ఏర్పరిచినా.. విద్యార్థులు భారీగా హాజరయ్యారని వైసీపీ శ్రేణులు పుల్ ఖుషీగా ఉన్నాయి. అయితే దీనికోసం జగన్ బాగా కష్టపడుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఆయన చుట్టూఉన్న సీనియర్లు సైతం జగన్కు ప్రత్యేకహోదాపై ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా.. సమాధానం ఇచ్చేలా ఇన్ ఫర్మేషన్ ఫీడ్ చేసి ఇచ్చారని చెప్తున్నారు. విశాఖలో యువభేరీలో ఆకట్టుకునే స్పీచ్ తో విద్యార్థులను ముగ్దులను చేసిన జగన్కు ఫ్రొఫెసర్ జగన్ అని ముద్దు పేరు కూడా పెట్టేశారు.  
 
 
ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో ఘాటు కౌంటర్ల ద్వారా అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా మారుతున్న జగన్ తన సబ్జెక్టును పెంచుకొని దూకుడు విమర్శలు చేస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవేమో.