Begin typing your search above and press return to search.

కొవిడ్ ఆసుపత్రులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   4 Aug 2020 8:30 AM GMT
కొవిడ్ ఆసుపత్రులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
X
వ్యవస్థ అన్నాక తప్పులు కామన్. అలా అని నిత్యం తిట్టటం.. మందలించటం.. హెచ్చరికలు జారీ చేయటం కంటే కూడా.. తప్పులు చేసే వారికి గుబులు పుట్టేలా చేస్తే.. లెక్క మొత్తం మారిపోతోంది. తాజాగా ఇదే విషయాన్ని ఏపీలోని జగన్ సర్కారు గుర్తించినట్లుంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొవిడ్ ఆసుపత్రుల్లో తప్పులు దొర్లకుండా పని చేయించటం అంత తేలికైన పని కాదు. ఈ సమస్యకు స్మార్ట్ గా ఆలోచించింది జగన్ సర్కారు. కొవిడ్ ఆసుపత్రులుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిఘా నేత్రాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది.

ఆసుపత్రుల్లో కొవిడ్ పేషెంట్లకు అందుతున్న వసతులు..అక్కడి వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం.. అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమేరాలు పెట్టాలని నిర్ణయించారు. ఐసీయూ.. నాన్ ఐసీయూ.. జనరల్ వార్డులతోసహా అన్నిచోట్ల సీసీ కెమేరాలు పెట్టటం.. వాటిని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్షించటం ద్వారా పని తీరు మెరుగు పడుతుందని భావిస్తున్నారు.

బాధితులకు సకాలంలో చికిత్స అందుతుందా? లేదా? మందులుఇస్తున్నారా? లేదా? భోజనం ఇస్తున్నారా? వారి ఆహారం ఎలా ఉంది? ఇలాంటి విషయాలతో పాటు.. కీలకమైన అన్ని అంశాల్ని గుర్తించటమే లక్ష్యమని చెబుతున్నారు. సీసీ కెమేరాల ద్వారా ఎక్కడైనా రోగులు ఇబ్బందికి గురవుతున్నట్లు గుర్తించినా.. సరైన వైద్యం అందనట్లుగా భావిస్తే.. వెంటనే వైద్యుల్ని అలెర్టు చేస్తారు. అంతేకాదు.. రోగుల విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరించే వారిపై చర్యలకుసీసీ కెమేరాలు పనికి వస్తాయని చెబుతన్నారు. తాజాగా తీసుకున్న సీసీ కెమేరాల నిర్ణయం ద్వారా ప్రజలకు మేలు జరగటం ఖాయమని చెప్పక తప్పదు. వీలైనంత త్వరగా ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.