Begin typing your search above and press return to search.

మీడియాకు కాక్ టైల్ పార్టీలా?..ఛాన్సే లేదన్న జగన్

By:  Tupaki Desk   |   20 Nov 2019 5:13 PM GMT
మీడియాకు కాక్ టైల్ పార్టీలా?..ఛాన్సే లేదన్న జగన్
X
ఏపీలో మద్య నిషేధం దిశగా సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా దూకుడుగా వెళుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బెల్టు షాపులను ఎత్తిపారేసి 20 శాతం వైన్ షాపులను రద్దు చేసేసిన జగన్... తాజాగా రాష్ట్రంలో 40 శాతం బార్లను తగ్గించేందుకు రంగం సిద్ధం చేసేశారు. ఇలాంటి సమయంలో తనపై వ్యతిరేక వార్తలు రాస్తూ... తనను బదనాం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేషనల్ మీడియా కోసం ఓ కాక్ టైల్ పార్టీ పెడదామంటూ వైసీపీకి చెందిన ఓ కీలక నేత చేసిన ప్రతిపాదనకు జగన్ నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. మద్య నిషేధం దిశగా సాగుతున్న మనం... మీడియాకు కాక్ టైల్ పార్టీలు ఇచ్చి ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుదామని జగన్ సంధించిన ప్రశ్నకు సదరు వైసీపీ నేత నోట మాట రాలేదట.

ఈ కథాకమామీషు ఏమిటన్న విషయంలోకి వెళితే... ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్... ప్రజలకు తానిచ్చిన హామీలను ఒక్కటొక్కటిగానే అమలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇందులో మద్య నిషేధాన్ని దశలవారీగా ఎత్తివేస్తామన్న హామీపై జగన్ దూకుడు మామూలుగా లేదనే చెప్పాలి. అయితే ఈ తరహా మంచి నిర్ణయాలను వదిలేసిన నేషనల్ మీడియా... ఇసుక కొరత, రాజధానిపై అనిశ్చితి అంటూ లెక్కలేనన్ని రాసిపారేస్తోంది. జగన్ ప్రత్యర్థి వర్గం అందిస్తున్న సూచనల ద్వారానే ఈ కథనాలన్నీ కూడా వండి వారుస్తున్న వైనం కూడా జగన్ కు తెలియనిదేమీ కాదు. ఈ తరహా ధోరణి నుంచి జాతీయ మీడియాను మళ్లించాలన్న విషయాన్ని అసలు పట్టించుకోని జగన్... తన పని తాను చేసుకుపోతున్నారు.

అయితే పార్టీ నేతలు తమపై నేషనల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారంతో కొంత మేర ఆందోళనకు గురవుతున్నారన్న మాట వాస్తవమే. ఈ వ్యతిరేక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని కూడా కొందరు యత్నిస్తున్నారు. నేషనల్ మీడియా ప్రతినిధులతో నేరుగా జగనే ఓ చిట్ చాట్ భేటీని నిర్వహిస్తే సరిపోతుందని కూడా కొందరు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే జగన్ కు సన్నిహితంగానే మెలగుతున్న ఓ నేత... నేషనల్ మీడియాకు ఓ కాక్ టైల్ పార్టీ ఇచ్చి మన వెర్షన్ చెబుదామంటూ జగన్ కు సలహా ఇచ్చారట. జాతీయ మీడియాతో చిట్ చాట్ ఓకే గానీ... మధ్యలో ఈ కాక్ టైల్ పార్టీ ఏమిటంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. రాష్ట్రాన్ని మద్య నిషేధం దిశగా నడిపిస్తున్న మనం... మీడియాకు కాక్ టైల్ పార్టీ ఎలా ఇస్తామని ప్రశ్నించారట. అంతేకాకుండా మీడియాకు కాక్ టైల్ పార్టీ ఇస్తే... మన అక్కచెల్లెమ్మలు ఏమనుకుంటారని కూడా జగన్ కాస్తంత గట్టిగానే కౌంటర్ ఇచ్చారట. అంతేకాకుండా మీడియాకే కాకుండా ఇంకెవరికి కూడా కాక్ టైల్ పార్టీలు ఇచ్చేది లేదని, తన వద్ద మరోమారు ఈ తరహా ప్రతిపాదనలు తీసుకురావద్దని కూడా జగన్ గట్టిగానే చెప్పారట.