Begin typing your search above and press return to search.

ప్రమాణ స్వీకార ముహూర్తం.. జగన్ ప్లాన్లు ఇవే

By:  Tupaki Desk   |   21 May 2019 9:00 AM GMT
ప్రమాణ స్వీకార ముహూర్తం.. జగన్ ప్లాన్లు ఇవే
X
ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత అలెర్ట్ అయ్యారు. ఫలితాలకు ముందు తర్వాత ఏం చేయాలనే దానిపై ప్లాన్ రెడీ చేశారు. తన షెడ్యూల్ ను ఖరారు చేసి ఆ దిశగా వైసీపీని సమాయత్తం చేస్తున్నారు..

ఫలితాలు వచ్చే మే 23కు ముందే 22న వైసీపీ అధినేత జగన్.. తన పార్టీ కొత్త కార్యాలయం ఉన్న అమరావతిలోని ఉండవల్లికి రానున్నారు. 23వ తేదీ నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాలపై సీనియర్ నేతలతో సమీక్షిస్తారు. గెలుపు ఖాయమనుకుంటే సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు - నాయకులకు సందేశం ఇస్తారు. ఇక 24వ తేదీన కూడా అమరావతి లోనే ఉండాలని జగన్ ప్లాన్ చేశారు. ఆరోజు పూర్తిగా పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు - నాయకులకు సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు.

ఇక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ 25న ఇడుపులపాయకు తీసుకెళ్లి అక్కడే సమావేశం ఏర్పాటు చేయిస్తారు. తన తండ్రి వైఎస్ సమాధి వద్దే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు నివాళులర్పిస్తారు. అనంతరం వైసీపీ శాసన సభాపక్షం నేతగా జగన్ ను ఎన్నుకుంటారు వైసీపీ ఎమ్మెల్యేలు.

ఇక ఈ సమావేశంలోనే తన ప్రమాణ స్వీకార తేది - సమయాన్ని జగన్ వెల్లడిస్తారు. ప్రచారం మొదలు.. అన్నీ కార్యక్రమాలను జగన్ విశాఖ స్వరూపానంద స్వామి నిర్ణయించిన ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతారు. స్వరూపానంద ఈనెల 30వ తేదీన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తాన్ని నిర్ణయించారట.. ఆ తేదీలోనే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది.

ఇక జాతీయ స్థాయిలో హంగ్ వస్తుందా.. క్లియర్ కట్ ప్రభుత్వం వస్తుందా అనేది వేచి చూసి 26న ఢిల్లీకి వెళ్లాలని జగన్ భావిస్తున్నాడు. అక్కడ పార్టీ సీనియర్ నేతలు - ఎంపీలతో సమావేశమై జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తారు. అంతేకాదు.. తనకు సన్నిహితులైన జాతీయ పార్టీల నేతలను తన ప్రమాణ స్వీకారానికి పిలుస్తారని తెలిసింది.

ఇక జగన్ తోపాటే 30న.. కొత్త కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని.. జగన్ ఈ మేరకు మంత్రులయ్యే వారి జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.