ఏపీకి ప్రత్యేక హోదా..జగన్ సాధించేలానే ఉన్నారే!

Wed Jul 17 2019 23:14:57 GMT+0530 (IST)

ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కలవరిస్తున్న ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేలానే ఉన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని ముఖం మీదే తేల్చి చెప్పేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు... జగన్ సీఎం పోస్టులోకి రాగానే తన వైఖరి మార్చుకున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.నిన్నటిదాకా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పార్లమెంటు సాక్షిగానే పలుమార్లు ప్రకటించిన కేంద్రం... ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పరిశీలించాలని అందులోని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కొత్తగా రంగంలోకి దిగిన 15వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేసిందంటే... ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ వైఖరి మారినట్టే కదా. నిన్నటిదాకా 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి... ప్రత్యేక హోదా ఫైలును చెత్త బుట్ట దాఖలు చేసిన మోదీ సర్కారు.. అదే నోటితో ఇప్పుడు 15 వ ఆర్థిక సంఘానికి అదే ప్రత్యేక హోదాను పరిశీలించాలని సూచించిందంటే ఆసక్తి రేకెత్తించేదే కదా.

అందులోనూ ఈ ప్రతిపాదనలకు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఢిల్లీ వచ్చి తనను కలిసి జగన్ ఇచ్చిన వినతి పత్రం మొన్నటి నీతి ఆయోగ్ లో జగన్ చేసిన ప్రసంగం అందజేసిన గణాంకాల ప్రతులను కూడా జతచేసి మోదీ సర్కారు ఆర్థిక సంఘానికి కొత్త గా ప్రతిపాదించింది. ఈ చర్య ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా గతించిన అంశమేమీ కాదని మోదీ సర్కారు చెప్పకనే చెప్పేసినట్టైంది. మొత్తంగా జగన్ కు మోదీ పెద్ద గిఫ్ట్ నే సిద్దం చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించాలంటూ నరేంద్ర మోదీ సర్కారు ఏకంగా 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదించిన విషయం ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. చూస్తోంటే... ముగిసిన అధ్యాయమని చెప్పిన బీజేపీతోనే జగన్ ఏపీకి ప్రత్యేక హోదా సాధించేసేలా ఉన్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి.