Begin typing your search above and press return to search.

జగన్... పవన్ స్థాయిలో లోకేష్...?

By:  Tupaki Desk   |   25 Jan 2023 7:00 AM GMT
జగన్... పవన్ స్థాయిలో లోకేష్...?
X
ఏపీ రాజకీయాల్లో చూస్తే యువ నేతలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ ఇద్దరు నేతలూ మరో రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగే విధంగా ముందుకు సాగుతున్నారు. జగన్ ముప్పయ్యేళ్ళ సీఎం తాను అని ముందే చెప్పేసుకుంటే పవ్న తనది కూడా పాతికేళ్ళ రాజకీయం అని పార్టీ పెడుతూనే చెప్పేశారు. ఇక ఈ ఇద్దరూ మరిన్ని ఎన్నికల్లో తలపడాల్సి ఉంటుంది.

ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు వయసు ఏడున్నర పదులుగా ఉంది. ఆయనకు 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు అని ఒక రకమైన విశ్లేషణ ఉంది. చంద్రబాబు సైతం ఆ మధ్య కర్నూల్ లో జరిగిన సభలలో మాట్లాడుతూ తనకు ఇవే చివరి ఎన్నికలు అని బాహాటంగానే చెప్పేసుకున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు పదే పదే మరో మాట అంటున్నారు. అదేంటి అంటే తాను చూడని అధికార వైభోగమా అని. మూడు సార్లు చంద్రబాబు సీఎం పదవిని చెపట్టారు.

అందులో రెండు సార్లు ఆయన ఉమ్మడి ఏపీని పాలిస్తే చివరి అయిదేళ్ళూ విభజన ఏపీకి సీఎం అయ్యారు. ఇక చంద్రబాబు 2024లో మళ్ళీ గెలిచినా కొన్నాళ్ళ తరువాత తన సీఎం కుర్చీని లోకేష్ బాబుకు ఇస్తారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట. ఆ విధంగా తాను మంచి పవర్ లో ఉన్నపుడే అధికార పగ్గాలు సాఫీగా తన కుమారుడికి అందిస్తే అతని భావి జీవితం మరింత దూకుడుగా సాగేందుకు వీలు కలుగుతుందని బాబు అంచనా కడుతున్నారు.

ఆ దిశగా బాబు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా అందులో భాగంగా చూడాలి. లోకేష్ ని గత పదేళ్లలో తెలుగుదేశం పార్టీలో తన తరువాత స్థానంలో నిలిపిన చంద్రబాబు పార్టీ జనాల ఆమోదముద్ర కూడా తీసుకున్నారు. మొదట్లో సీనియర్ నేతలు లోకేష్ నాయకత్వం పట్ల పెద్దగా ఆసక్తి చూపించకపోయినా ఇపుడు అంత జై కొడుతున్నారు. అలా పార్టీ లోకేష్ దారిలోకి వచ్చేసింది.

ఇక ప్రజల మద్దతు లోకేష్ కి కావాలి. ఎవరైనా నాయకుడు పదికాలాలు నిలబడాలీ అంటే సర్వజన ఆమోదం ఉండాలి. జగన్ సైతం జనంలోనే ఉంటూ తన నాయకత్వ పటిమని రుజువు చేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొత్త తరానికి నాయకత్వం వహించే నేతగా ఉంటున్నారు. ఆయన పార్టీ అధికార విజయాలు నమోదు చేయకపోయినా పవన్ సీఎం స్థాయి నేతగా ఏపీ జనం మనసుల్లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన కోరికను జనాలు తీర్చినా తీర్చవచ్చు లేక మరికొంత కాలం ఆయన వేచి ఉండవచ్చు. ఏదేమైనా ఆయన ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్ధి అని జనం అంగీకరిస్తున్న సత్యం.

ఇక లోకేష్ విషయానికి వస్తే జనాల్లో ఆయన ఇంకా తండ్రి చంద్రబాబు చాటు బిడ్డడుగానే ఉన్నారు. లోకేష్ ని చినబాబుగానే చూస్తున్నారు. ఆయన నాయకత్వం రుజువు చేసుకునే సందర్భాలు పెద్దగా రాలేదు అందుకే లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర కచ్చితంగా లోకేష్ ని జన నాయకుడిని చేస్తుందని తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఇక చంద్రబాబు సైతం లోకేష్ ని ప్రజా నేతగా తీర్చి దిద్దే క్రమంలో తెర వెనక చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు.

లోకష్ తన మాటలతో ప్రసంగాలతో తన హావ భావాలతో తన నడకతో నడతతో ఏపీ జనాలను ఎలా ఆకట్టుకుంటారు అన్నది చూడాలి పాదయాత్ర ద్వారా లోకేష్ ఎవరు ఆయన సత్తా ఏంటి అన్నది ప్రజాలకు తేటతెల్లంగా తెలిసే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. అలాగే లోకేష్ లోపలి మనిషిని కూడా పార్టీ జనాలు తెలుసుకుంటారు.

లోకేష్ నాయకత్వ పటిమ ఏ స్థాయిలో ఉంది ప్రజల మీద సమస్యల మీద ఆయనకు ఉన్న అవగాహన ఏంటి అన్నది కూడా పాదయాత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే రేపటి ఎన్నికల్లో చంద్రబాబు జగన్ పవన్ మధ్య రాజకీయ నడచినా 2029 నాటికి జగన్ పవన్ సరిసాటిగా లోకేష్ నిలిచేలా ఆయన రాజకీయ ప్రస్థానం పరిపూర్ణనా సాగేలా ఈ పాదయాత్ర దోహదపడుతుంది అని అంటున్నారు. ఈ పాదయాత్రలో లోకేష్ తెలుగుదేశానికే కాదు ఏపీ జనానికి కూడా బెస్ట్ చాయిస్ లీడర్ అవుతారా లేదా అన్నది తెలియాలంటే పాదయాత్ర సాగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.