ఆ ఇద్దరినీ ఇరుకున పెట్టిన జగన్...కక్కలేక... మింగలేక..

Sat Sep 24 2022 16:54:32 GMT+0530 (India Standard Time)

Jagan Kept Aside That Two Ministers

జగన్ డెసిషన్స్ అన్నీ దూకుడుగా ఉంటాయి. అవి బయటకు వచ్చేంతవరకూ కూడా ఎవరికీ తెలియవు. ఇక వన్స్ డెసిషన్ తీసుకున్నాక జగన్ వెనక్కి వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఆయన లాభానికైనా నష్టానికైనా రెడీగా ఉంటారు. కానీ ఆ నిర్ణయ ప్రభావం మిగిలిన వాళ్ల మీద పడితే వారు అలా లైట్ గానో లేక టేకిట్ ఈజీగానో తీసుకోలేరు కదా అన్న మాట ఉంది.ఇపుడు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని వైసీపీలో ఇద్దరు కీలక నేతలు ఎదుర్కొంటున్నారు. వారే మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ ఇద్దరు నేతలూ కూడా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా ఊహించి ఉండరు. పైగా వారు చంద్రబాబు మీద ప్రతీ రోజూ ఒంటికాలి మీద లేచి మాట్లాడుతూ ఉంటారు. జగన్ అండ చూసుకుని వారు చాలానే నోరు చేశారు.

ఇపుడు జగన్ తన వైపు నుంచి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా విజయవాడ హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్ పేరుని తొలగించి వైఎస్సార్ పేరు పట్టడం పట్ల ఏపీవ్యాప్తంగా ఎలాంటి భావన ఉన్నా ప్రభావం మాత్రం క్రిష్ణా జిల్లాలోనే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాంతో విజయవాడలో ఉన్న గన్నవరం సీటు విషయంలో వల్లభనేని వంశీ చాలా కంగారు పడుతునారని అంటున్నారు.

ఆయన 2019 ఎన్నికల్లో ఈ సీటు నుంచి టీడీపీ తరఫున గెలిచి వైసీపీలోకి వచ్చారు. అలా వైసీపీ జెండా ఎత్తిన ఆయనకు ఇపుడు సంకట పరిస్థితి ఎదురైంది. తన నియోజకవర్గంలో దీని వల్ల పూర్తిగా ప్రతికూల ప్రభావం ఉంటుందని వంశీ కలవరపడుతున్నారు. దాంతో ఆయన ఎన్టీయార్ పేరు మార్చవద్దు అని జగన్ కి నేరుగా రిక్వెస్ట్ చేశారు. అయినా బిల్లు అసెంబ్లీలో పాస్ అయిపోయింది. ఇక చేసేది లేక వంశీ సైలెంట్ అయ్యారు.

ఇపుడు అందరి చూపు కొడాలి నాని మీదనే ఉంది. ఆయన జగన్ని అభిమానించి వైసీపీలో చేరినా ఆయన ఎన్టీయార్ కి వీరాభిమాని. ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచారు అన్న ఒకే ఒక్క కారణం మీద ఆయన చంద్రబాబుని ఈ రోజు దాకా ద్వేషిస్తున్నారు. ఇపుడు ఆయన పేరుని హెల్త్ వర్శిటీకి తీసేసిన జగన్ మీద అలాంటి కోపం ఉంటుందనే అంతా అంటున్నారు.

అయితే ఆయన మాత్రం ఎక్కడా బయటపడడంలేదు. అదే సమయంలో వ్యూహాత్మకమైన మౌనం దాలుస్తున్నారు. ఇక నాని తన సన్నిహితుల వద్ద అయితే ఏంటి జగన్ ఇలా చేశారని వాపోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా గుడివాడ నిండా ఎన్టీయార్ భక్తులే ఉంటున్నారు. వారు కొడాలి నానికి ఓటేస్తూ ఉంటారు. ఆయన హర్డ్ కోర్ ఎన్టీయార్ ఫ్యాన్ కాబట్టే అలా జరుగుతోంది. మరి అదే ఎన్టీయార్ కి అవమానం జరిగింది అది కూడా నాని ఉన్న వైసీపీ ప్రభుత్వంలోనే.

మరి దాని మీద నాని మాట్లాడాలి అని పెద్ద ఎత్తున వత్తిడి వస్తోందిట. అయితే కొడాలి నాని మాత్రం ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారని టాక్. బయటపడితే వైసీపీతో ఇబ్బందులు వస్తాయి. అలాగని ఊరుకుంటే ఏం జరుగుతుందో రేపు తెలియదు. దాంతో కిందా మీద అవుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే వంశీ కానీ కొడాలి  నాని కానీ ప్రస్తుతానికి వ్యూహాత్మకమైన మౌనాన్ని ఆశ్రయించారని అంటున్నారు.

మరి ఈ ఇద్దరు ఎపుడు పెదవి విప్పుతారో చూడాలి. ఏది ఏమైనా గుడివాడలో  కొడాలి నాని గెలవాలన్నా వల్లభనేని  వంశీ గన్నవరంలో గెలవాలన్నా ఎన్టీయార్ ట్యాగ్ కూడా చాలా చాలా  అవసరం. మరి ఆ నాయకుడి విషయంలో ఏమీ మాట్లాడకుండా మౌనం దాలిస్తే మాత్రం పొలిటికల్ గా బిగ్ ట్రబుల్స్ లో పడతారు అని అంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.