Begin typing your search above and press return to search.

జగన్ ఫుల్ హ్యాపీ.. టీడీపీకి బీపీ...?

By:  Tupaki Desk   |   28 Nov 2022 11:30 AM GMT
జగన్ ఫుల్ హ్యాపీ.. టీడీపీకి బీపీ...?
X
అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద సుప్రీం కోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. కొన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. అలాగే సుప్రీం కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తే ఎలా అంటూ కోర్టు ప్రశ్నించడం నిజంగా వైసీపీ వాదనకు బలం చేకూరేదే.

అదే విధంగా అభివృద్ధి ప్రభుత్వం చేస్తుంది. అది విధానపరమైన నిర్ణయం కోర్టులకు సంబంధం లేదు అన్నట్లుగా చేసిన కామెంట్స్ కూడా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయని అంటున్నారు. మరో సందర్భంగా హై కోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అని ప్రశ్నించడం కూడా గమనార్హం. ప్రభుత్వానికి శాసన వ్యవస్థకు అధికారాలు లేవు అని చెప్పడాన్ని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

ఇక అయిదు కీలకమైన విషయాలలో స్టే ఇచ్చింది. ప్రత్యేకించి ఆరు నెలల వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయాలన్న దాని మీద స్టే విధించింది. దీంతో ఇపుదు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కినట్లు అయింది. నిజానికి అమరావతి రాజధాని విషయంలో తమకే తీర్పు అనుకూలంగా వస్తుందని అటు విపక్షాలు ఆశతో ఉన్నాయి. ఇటు ప్రభుత్వం తీసుకుంటే మూడు రాజధానులు వికేంద్రీకరణ తమ విధానం అంటూ ముందుకు పోయింది.

దాని మీద ఏకంగా శాసనసభలో మూడు రాజధానుల చట్టం కూడా చేసింది. అయితే న్యాయ సమీక్షకు అది గురి అయి ఇబ్బంది అవుతుంది అన్నపుడు విరమించుకుంది. ఆ తరువాత కూడా హై కోర్టులో వాదనలు జరగడం లేని చట్టం మీద హై కోర్టు తీర్పు ఇచ్చిందని, అలాగే శాసనసభ అధికారాలను నియంత్రించేందుకు చూసిందని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ఈ లోగా మూడు రాజధానులను అలాగే జనంలో చర్చకు ఉండేలా ప్రభుత్వం చేయాల్సినవి చేస్తోంది. ఉత్తరాంధ్రాకు పాలనా రాజధాని అంటూ ప్రకటించడమే కాదు, ఎప్పటికపుడు మంత్రులు దాన్ని గుర్తు చేస్తున్నారు. ర్యాలీలు మీటింగులు కూడా నిర్వహిస్తున్నారు. రాయలసీమ విషయంలోనూ అదే జరుగుతోంది. న్యాయ రాజధాని అక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్ తో జేఏసీలు మీటింగ్స్ పెడుతున్నాయి.

అయితే టీడీపీ మాత్రం అమరావతి తమ రాజధాని అని చెబుతోంది. ఇదే స్టాండ్ తో ఉత్తరాంధ్రా, రాయలసీమలలో కూడా ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇపుడు మధ్యంతర ఉత్తర్వులు కొంత వరకూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక తుది తీర్పు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ లోగా వైసీపీ తమ మైండ్ గేం ని స్టార్ట్ చేస్తే మాత్రం విపక్ష టీడీపీకి ఇబ్బందికరమే అంటున్నారు.

అమరావతి ఏకైక రాజధాని అంటూ టీడీపీ వైసీపీ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయిందనే అంటున్నారు. ఎన్నికల వేళ దాకా సుప్రీం కోర్టులో తుది తీర్పు రాకపోయినా ఇపుడు వైసీపీ వికేంద్రీకరణ తమ విధానం అని గట్టిగా చెప్పుకుంటూ జనంలోకి వెళ్తుంది అని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ అమరావతి అంటూ నినదించడానికి ఎంతో కొంత సంశయించాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక టీడీపీ బాటలోనే మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి.

తుది తీర్పు అమరావతి అంటే టీడీపీకి అది బ్రహ్మాండమైన ఫలితమే. కానీ అది ఎప్పటికి వస్తుందో తెలియదు. ఈ లోగా ఎన్నికలకు వైసీపీ వెళ్తే మాత్రం దెబ్బ పడిపోవడం టీడీపీకే అని అంటున్నారు. ఏది ఏమైనా అభివృద్ధి ప్రభుత్వాల పని అని ఒకే చోట అభివృద్ధి ఉండాలని ఎలా కోర్టులు ఆదేశించగలవు ఆరు నెలలలోగా నిర్మానాలు పూర్తి చేయాలని ఎలా అదేశిస్తారు అంటూ సుప్రీం లేవనెత్తిన ప్రశ్నలు అన్నీ కూడా వైసీపీకి ఈ దశలో అనుకూలంగానే ఉన్నాయని అంటున్నారు. మరి ఈ పాయింట్స్ తో వైసీపీ కొత్త రకమైన ప్లాన్ కనుక రూపొందిస్తే అది కచ్చితంగా టీడీపీ సహా విపక్షాలకు బిగ్ ట్రబుల్స్ ని క్రియేట్ చేస్తుంది అనే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.